రంగారెడ్డి జిల్లా నార్సింగిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యార్థి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంటర్ విద్యార్థి ఎలా చనిపోయాడనే దానిపై ఆరా తీశారు. విద్యార్థి మృతిపై విచారణకు ఆదేశించారు. పూర్తి నివేదిక ఇవ్వాలని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిట్టల్ కు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ఒత్తిడి తట్టుకోలేకే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడనే ఆరోపణలపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యార్థులెవరూ మార్కులే ప్రాధాన్యంగా జీవించకూడదని.. మార్కులే జీవితాలను నిర్ణయించవని అన్నారు. పరీక్షల్లో కనీసం పార్కు మార్కులు తెచ్చుకున్నా సరిపోతుందని.. దానికోసం ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోవడం సరికాదని సూచించారు. కళాశాల యాజమాన్యాలు కూడా విద్యార్థులను మార్కులు తీసుకొచ్చే ర్యాంకుల మెషీన్లుగా భావించొద్దని హితవు పలికారు. విద్యార్థులను ఒత్తిడికి గురి చేయొద్దని.. మానసికంగా హింసించొద్దని సూచించారు.