కరోనా మహమ్మారి విజృంభణ మునుపటి కంటే కాస్త తగ్గిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చాలా మంది బయటకు వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నెల నుండి మొదలవుతున్న పండగల కారణంగా షాపింగ్ కోసమనో, మరొకదానికో బయటకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటున్నారు. ఐతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే కరోనా విజృంభణ ఆగిపోలేదు. కానీ రికవరీ రేటు పెరిగింది. అందువల్లే కేసులు తగ్గుతూ వస్తున్నాయి.
ఐతే ఇలాంటి టైమ్ లో పండగ ఎలా జరుపుకోవాలన్న మీమాంస అందరిలోనూ ఉంది. పండగ అంటే పాజిటివిటీ నింపేది. కరోనా కాలంలో పూర్తి నెగెటివిటీ విస్తరిస్తున్న నేపథ్యంలో పాజిటివ్ దృక్పథం ఎంతో అవసరం. ఐతే జాగ్రత్తతో కూడిన పాజిటివిటీ అనేది చాలా అవసరం.
పండగలు వస్తున్నాయి. షాపింగ్ కి బయటకి వెళ్ళాలి. బయటకు వెళ్ళకుండా పండగ చేసుకోవడం కష్టం అనుకున్నవాళ్ళు ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలి. మొదటగా మాస్క్ ఖచ్చితంగా ధరించండి. అలాగే తరచుగా చేతులని శానిటైన్ చేసుకోవాలి. కనీసం 20సెకన్ల పాటైనా శానిటైజ్ చేస్తే మంచిది. బయట నుండి ఏది తెచ్చుకున్నా శానిటైజ్ చేయడం మర్చిపోవద్దు.
ముఖ్యంగా ఎక్కువ మంది ఉన్న చోటుకి వెళ్తున్నప్పుడు వ్యక్తికి వ్యక్తికి మధ్య రెండు మీటర్ల దూరం ఉండేలా చూసుకోండి. బయట కలిసే వ్యక్తులతో ముఖాముఖి చర్చలు పెట్టుకోకపోవడం మంచిది. పండగ సంబరాలు జరుపుకోవాలంటే ఓపెన్ ఏరియాలో చేసుకోండి. అక్కడ కూడా భౌతిక దూరం పాటించాల్సిందే. ఒక్కసారి బయట నుండి ఇంటికి రాగానే మాస్కుతో పాటు ఒంటిమీద బట్టలని శుభ్రంగా ఉతుక్కోవాలి. స్నానం చేయడం ఉత్తమం. శరీరంలో ఏదైనా తేడా కనిపించినపుడు వెంటనే డాక్టరుని సంప్రదించాలి.
ఈ జాగ్రత్తలు పాటిస్తూ మీతో పాటు మీ పక్కవారిని ఆరోగ్యంగా ఉంచండి.