ప్రజలతో మమేకమైన వైసీపీ ప్రభుత్వం చేపట్టిన గడపగడపకు కార్యక్రమంలో పాల్గొనని మంత్రులు, ఎమ్మె్ల్యేలపై సీఎం జగన్ హెచ్చరించారు. పని చేసిన వారికే టిక్కెట్లు వస్తాయని వ్యాఖ్యానించారు. అయితే జగన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంల ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం జరుగుతోన్న తీరుపై సీఎం సమీక్షించారని, ఎమ్మెల్యేల్లో ఎవరివైనా లోపాలు ఉంటే సరిగిద్దుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. ఎమ్మెల్యేలు ఎవరికీ సీఎం జగన్ వార్నింగ్ లు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లి ఆశీస్సులు కోరాలని వెనకబడితే ఇబ్బందవుతుందని సీఎం చెప్పారని, ఇబ్బంది వల్ల పార్టీ నష్టపోతుందని తేలితే కచ్చితంగా దాని గురించి ఆలోచిస్తామని సీఎం స్పష్టంగా చెప్పారన్నారు.
వైసీపీ 5 ఏళ్లపాటు మాత్రమే అధికారంలో ఉండాలని రాలేదు..నిరంతరం ప్రజల ఆశీస్సులతో ఉండాలని వైసీపీ కోరుకుంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ప్రజలే ఎమ్మెల్యేల గ్రాఫ్ ను నిర్ణయిస్తారని, ప్రజల్లో తిరిగితే ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరుగుతుందని, ఆరోగ్య సమస్యలు, పార్టీ కార్యక్రమాలు, రకరకాల కారణాల వల్ల కొందరు ఇంకా ప్రారంభించలేదన్నారు. అందరూ తప్పనిసరిగా గడప గడప కార్యక్రమంలో పాల్గొనాలని సీఎం సూచించారని, వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే మహిళల పసుపు కుంకాలు పోతాయని పవన్ వ్యాఖ్యలపై స్పందించడం వృథా సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.