నవంబరు 1 నుంచి 2023 సబ్ జూనియర్ టోర్నమెంట్‌ను ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి డిక్లేర్ చేశారు. క్రీడలకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొ్న్నారు. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే అద్భుతమైన అవకాశాలు క్రీడలలో ఇస్తున్నామన్నారు. ఆల్ ఇండియా సబ్ జూనియర్ టోర్నమెంట్ ప్రారంభించడం క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
రాష్ట్రం మొత్తం ఆటలు క్రీడలతో ఉత్సవంలా ఉందని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థులలో పోటీ పెంచే క్రీడలను అందరూ ప్రోత్సహించాలన్నారు. చంద్రబాబుకు అత్యంత తీవ్రమైన వ్యాధులున్నాయి, ప్రాణాలకే ప్రమాదమని వాదించారని ఆయన తెలిపారు. వాళ్ళ రూట్ మ్యాప్ రాగానే మేం న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లామన్నారు. రెండున్నర గంటలు సమయం పట్టే ప్రయాణాన్ని 14గంటలు మీడియా ఫోకస్ కోసం ఒక ఈవెంట్‌లా చేశారని ఆయన ఆరోపించారు.
రోగి ఒక యోగి లాగా, స్వాతంత్య్ర సమరయోధుడిలా ఎలా బయటకి వచ్చాడని.. కారులో 24 గంటలు ప్రయాణం చేయగలగడం న్యాయస్థానం చెప్పినా పాటించకపోవడం కాదా అంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఈ జన్మకు మారడని.. యుద్ధం అనేది 2019లోనే అయిపోయిందన్నారు. క్షతగాత్రులు అయిన టీడీపీ నేతలు ఉంటే.. దత్తపుత్రుడి భుజం మీద చేతులేసి వారిని కూడగట్టుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. యుద్ధానికి అవతల ఎవరున్నారు… లోకేష్‌వి అన్నీ నిద్రలో వచ్చిన పలవరింతలు అంటూ ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. లోకేష్ నిజంగానే వారసుడిగా ఉన్నాడా అంటూ ఆయన ప్రశ్నించారు.