సొంత జిల్లాలో సంజయ్ స్పీడ్..ఆ మంత్రికి ముప్పు తెచ్చేలా ఉందే

-

మొన్న మాజీ ఎమ్మెల్యేలతో చర్చలు…ఇప్పుడేమో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్లతో ఆపరేషన్ ఆకర్ష్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీజేపీ బలోపేతానికి బండి సంజయ్ వేస్తున్న స్కెచ్ లు అధికార పార్టీలో గుబులు రేపుతున్నాయి. రాజకీయ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న నేతలంతా ఇప్పుడు బీజేపీ వైపు చూడటంతో మంత్రులకు సైతం ముచ్చెమట్టలు పడుతున్నాయట…ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కారును వీడి కమలం గూటికి గూటికి చేరుతున్నవారి పై ఆసక్తికర చర్చ నడుస్తుంది.

తెలంగాణ రాష్ట్రంలో జరిగే రాజకీయాలు వేరు..కరీంనగర్ జిల్లా రాజకీయాలు వేరు..అంతేకాదు ఇక్కడ పాలిటిక్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ గానే ఉంటాయి…ఈ జిల్లా మొదట్లో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నా ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జిల్లాలో టిఆర్ఎస్ హవా కొనసాగింది..ఇప్పుడు తాజాగా జిల్లాలో బీజేపీ బలోపేతానికి బండి సంజయ్ ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెట్టారు. తెలంగాణలో కమలం పార్టీ జోష్ నేపథ్యంలో జిల్లాల నేతలపై ఫోకస్ పెట్టారట..అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సొంత జిల్లా నుండే కసరత్తు మొదలు పెట్టారన్న టాక్ నడుస్తోంది..

గతంలో కంటే బిజెపి ఇప్పుడు పుంజుకుంటుండడంతో రాజకీయ భవిష్యత్ ను వెతుక్కుంటున్న నేతలను ఇప్పుడు కమలం పార్టీ ఆకర్షిస్తుంది..మొన్నటివరకు ఉమ్మడి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలతో రహస్యంగా చర్చలు జరిపిన బిజేపీ అగ్ర నేతలు ఇప్పుడు కరీంనగర్ మున్సిపల్ కార్పోరేషన్ పై ఫోకస్ పెట్టారు..అందులో భాగంగా తాజాగా జిల్లా పర్యటనకు వచ్చిన బండి సంజయ్ తో అధికార టిఆర్ఎస్ పార్టీ కార్పోరేటర్లు భేటి అయ్యి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారట..అందులో మాజీ డిప్యూటీ మేయర్ 29వ డివిజన్ కార్పోరేటర్ భర్త మరియు మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అనుచరుడు రమేష్ కారు వీడి కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు.

ఇప్పటికే ఉమ్మడి జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్,పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావుతో పాటు ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్ధి అడ్లూరి లక్ష్మణ్ ను పార్టీలో తీసుకొచ్చేందుకు సంజయ్ చర్చలు జరుపుతుండగా అధికార పార్టీ నేతల పై సైతం ఫోకస్ పెట్టడంతో టిఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది..బీజేపీలో వెళ్లేందుకు సిద్ధం అయిన నేతలను, కార్పోరేటర్లను బుజ్జగించే పనిలో పడ్డారట టిఆర్ఎస్ నేతలు. మంత్రి గంగుల కమలాకర్ హుటాహుటిన కరీంనగర్ లోని ఓ ప్రయివేట్ హోటల్లో నగర కార్పోరేటర్లు,ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు.. పార్టీని ఎవరూ వీడొద్దని మంత్రి అయినప్పటికీ తాను అందరికీ అందుబాటులో ఉంటున్నానని ఎవరికి ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారట..

రాబోయే రోజుల్లో కూడా అధికారం టిఆర్ఎస్ దే అని బీజేపీ హవా కొద్దీ రోజులు మాత్రమే ఉంటుందని స్థానిక నేతలకు బ్రెయిన్ వాష్ చేస్తున్నారట..అయితే పార్టీని వీడుతున్న వారు వీడాలనే ఆలోచన ఉన్న వారంతా తమకు పార్టీలో సరైన గుర్తింపు లేదని ఇన్ని రోజులు కష్టపడ్డా ఎలాంటి నామినేటెడ్ పోస్టులు కూడా రాలేదని వాపోతున్నారట…ఇక రాష్ట్రంలో రాబోయేది బీజీపీ హావానేనని అందుకు ఇప్పటి నుండే బెర్తులు ఖరారు చేసుకోవడం మంచిదని భావిస్తున్నారట అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు..

కరీంనగర్ కార్పొరేషన్ మాత్రమే కాకుండా కరీంనగర్ అసెంబ్లీపై కూడా బీజేపీ దృష్టిపెట్టడంతో మంత్రి గంగుల కమలాకర్ గ్రామాలవారీగా పర్యటించి నేరుగా నేతలతో మాట్లాడి బుజ్జగిస్తున్నారట. మొత్తానికి సంజయ్ స్పీడు మంత్రి సీటుకు ఎసరు పెట్టేలా ఉందనే టాక్ ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news