సెప్టెంబర్ 25 నుంచి పాదయాత్ర చేపట్టాలని పదాధికారుల సమావేశంలో నిర్ణయించినట్లు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ వెల్లడించారు. పాదయాత్ర ఏ విధంగా చేపట్టాలి.. ఎక్కడి నుంచి ప్రారంభించాలనే అంశంపై చర్చిస్తున్నామని, నాలుగు జోన్లుగా విభజించి పాదయాత్ర చేయాలా..? లేక పూర్తి స్థాయిలో చేయాలా..? అనే దానిపై చర్చిస్తున్నామన్నారు సత్యకుమార్. అంతేకాకుండా వైసీపీపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతిచ్చామని వైసీపీ చెప్పుకుంటోందని, రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వమని మేం అడిగామా..? అని సత్యకుమార్ ప్రశ్నించారు. అంతేకాక.. గిరిజన అభ్యర్థికి మద్దతివ్వాలో.. వద్దో పార్టీ తేల్చుకోవాలని, పార్లమెంటులో బిల్లులకు మద్దతిచ్చి.. ఏపీలో దానికి భిన్నంగా వైసీపీ వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు.
రైతు చట్టాలకు పార్లమెంటులో మద్దతిచ్చి.. ఏపీలో భారత్ బంద్ కు వైసీపీ మద్దతిచ్చిందన్నారు. బిల్లులకు మద్దతివ్వమని మేం ఎప్పుడూ వైసీపీని కోరలేదని ఆయన స్పష్టం చేశారు. మా వెనుకాల తిరుగుతూ ఫొటోల్లో కన్పించేలా తాపత్రాయపడుతూ మేం బీజేపీ తోక పార్టీ అని వైసీపీ చెప్పుకునే ప్రయత్నం చేస్తోందంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు సత్యకుమార్. ప్లీనరీ వేదికగా జగన్ నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పారని ఆరోపించిన సత్యకుమార్.. జగన్ తనను తాను దైవ దూతగా భావిస్తున్నారని, జగనన్న విద్యా దీవెన నిధులు కేంద్రానివేనని ఆయన అన్నారు.