ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఇప్పటికీ ఇంకా కరోనా (కోవిడ్-19) వైరస్ ప్రభావం తగ్గనేలేదు. చైనాలో నిత్యం వందల సంఖ్యలో ఈ వైరస్ కారణంగా మరణిస్తున్నారు. ఎన్నో వేల మందికి ఇప్పటికే ఈ వైరస్ సోకగా వారు హాస్పిటళ్లలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే కరోనా భయం ఇంకా మనల్ని వదలక ముందే బ్రెజిల్‌లో సైంటిస్టులు మరో కొత్త వైరస్‌ను కనుగొన్నారు.
బ్రెజిల్‌లోని పంపుల్హా అనే సరస్సులో బెర్నార్డ్ లా స్కోలా, జోనాటస్ ఎస్.అబ్రహావో అనే ఇద్దరు వైరాలజీ సైంటిస్టులు ఓ నూతన వైరస్‌ను కనుగొన్నారు. దానికి యారా వైరస్ (Yara Virus) అని నామకరణం చేశారు. యారా అంటే బ్రెజిల్ నీటి దేవత అని అర్థం వస్తుంది. అయితే ఈ కొత్త వైరస్ కరోనా మాదిరిగా ప్రమాదకరమా, కాదా, అది ఎలా వ్యాప్తి చెందుతుంది.. అనే వివరాలు ఇంకా తెలియలేదు. సదరు సైంటిస్టులు మరిన్ని పరిశోధనలు చేసి ఆ విషయాలు తెలుసుకోనున్నారు.
కాగా 2 సంవత్సరాల కిందట కూడా ఇలాగే సైంటిస్టులు ఓ కొత్త వైరస్‌ను కనుగొనగా దానికి అప్పట్లో Tupan అని పేరు పెట్టారు. అయితే ఈ వైరస్‌కు యారా వైరస్‌కు చాలా దగ్గరి పోలికలు ఉండి ఉంటాయని సైంటిస్టులు భావిస్తున్నారు. ఇక యారా వైరస్ ప్రాణాంతకమా, కాదా, అది ఎలా పెరుగుతుంది.. అనే విషయాలను త్వరలో తెలుసుకుంటామని సదరు సైంటిస్టులు తెలిపారు.