అందరూ బామ్మర్లే(బ్రాహ్మలు) కానీ, గంపలో పెట్టిన చేపలకూరేమైంది? అన్నట్టుగా ఉంది టీడీపీ మాజీ నేత, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి వ్యవహారం. ప్రస్తుతం హయత్ హోటల్ రహస్య భేటీ వ్యవహారం సుజనా చౌదరి సహా బీజేపీకి చుట్టుకునే అవకాశం ఏర్పడింది. దీంతో హుటాహుటిన స్పందించిన ఆయన కొన్ని కామెంట్లు చేశారు. అయితే, ఈ కామెంట్లు ఎక్కడా అతకకపోగా.. ఇలా కూడా కవర్ చేసుకుంటారా? అనేలా అనిపించాయి. పార్క్‌హయత్ హోటల్‌లో సుజనా చౌదరి, మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్‌లు ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌బాబుతో భేటీ అయ్యారు.
ప్రస్తుతం నిమ్మగడ్డకు ఏపీలోని వైసీపీ ప్రభుత్వానికి మధ్య తీవ్ర యుద్ధం జరుగుతున్న సమయంలో వీరి భేటీ మరింత వివాదం గా మారింది. దీంతో పుంఖానుపుంఖాలుగా వార్తలు వెలుగు చూస్తున్నాయి. అసలు ఏం జరిగింది? అనే చర్చ మొదలైంది. ఎందుకంటే.. నిమ్మగడ్డ పక్షాన హైకోర్టులో పోరాడింది తానేనని, ప్రజాస్వామ్యాన్ని బతికించేందుకు, ఏపీలో రాజ్యాంగ విలువలు కాపాడేందుకు తాను పూనుకున్నానని, ఈ క్రమంలోనే హైకోర్టలో పిల్ వేశానని కామినేని గతంలో చెప్పుకొన్నారు. హైకోర్టులో ఈ విషయంలో పాజిటివ్ తీర్పు వచ్చింది.
అయితే, ఇప్పుడు ఈ కేసుపై సుప్రీం కోర్టులో విచారణ పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డతో కామినేని కలవడం, దీనికి సుజనా తోడవడం ఆసక్తికలిగిస్తోంది. ఇవన్నీ ఇలా జరిగితే.. వెంటనే మీడియా ముందుకు వచ్చిన సుజనా మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఫ్యామిలీ ఫ్రెండ్ అని, ఆయనను కలిస్తే తప్పేంటని వ్యాఖ్యానించారు. అంతేకాదు, కామినేని .. తనను కొన్నాళ్ల కిందటే అప్పాయింట్‌మెంట్ అడిగారని, దీంతో ఆయన పార్క్ హయత్ హోటల్‌లో అప్పాయింట్‌మెంట్ ఇచ్చానని పార్టీ కార్యక్రమాలపై చర్చించామని, దీనిలో దాపరికం ఏమీలేదని చెప్పుకొచ్చారు.
కానీ, ఇక్కడే క్లారిటీ మిస్సవుతోంది. కలిస్తే.. కామినేని, సుజనా కలిసి ఉండాలి. మధ్యలో నిమ్మగడ్డతో ఏం పని! పైగా ఆయన రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి ఆయనతో వీరికి ఏం పని! సో.. మొత్తంగా ఏదో ఉందనే విషయం అంతగా అర్ధమవుతున్నా.. సుజనా మాత్రం.. మాకేమీ తెలియదు.. అంటున్నారు. దీనిని విన్న, కన్న వాళ్లు.. అందరూ బామ్మర్లే.. చేపలకూరేమైనట్టు? అంటున్నారు!!