తెలంగాణలో నాలుగు రోజుల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. పొద్దున బ్రేక్ ఇస్తే సాయంత్రం వరకు దంచి కొడుతోంది. ఓవైపు ఎగువ నుంచి వస్తున్న వరద.. మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద సోమవారం ఉదయం 11 గంటలకు 41 అడుగులకు చేరిన నీటిమట్టం అర్ధరాత్రి 12 గంటలకు 48 అడుగులకు పెరగడంతో కలెక్టర్ అనుదీప్ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో మళ్లీ భద్రాద్రి వద్ద నీటిమట్టం భారీగా పెరుగుతూ ఈ రోజు ఉదయం 7 గంటలకు 50 అడుగులకు చేరింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరిలో 12,51,999 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. భద్రాద్రి ఆలయ స్నానఘట్టాలు చాలావరకు మునిగాయి. తలనీలాలను సమర్పించే కల్యాణకట్ట దిగువకు నీరు చేరింది. ఈ నేపథ్యంలో ప్రజల్ని అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎస్ సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు.
భద్రాద్రి కొత్తగూడెం, ములుగు సహా ఇతర జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలివ్వాలని సూచించారు. మరోవైపు మంగళ, బుధవారాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు కురిసే సూచనలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. సోమవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా లోకేశ్వరం(నిర్మల్ జిల్లా)లో 3.2, గుండుమాల్ (నారాయణపేట)లో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఆదివారం రాత్రి అత్యధికంగా లక్ష్మణచాందా(నిర్మల్)లో 14.3, పొచ్చెర(ఆదిలాబాద్)లో 12.2 సెం.మీ. వర్షపాతం నమోదైంది.