కుమారుడు చదువుకోవడం లేదని నిప్పంటించాడు..!

-

కంటికి రెప్పాలా కాపాడాల్సిన కన్న తండ్రే, యముడిగా మారాడు. తన కుమారుడిపై టార్పంటాయిల్‌ పోసి నిప్పంటించాడు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొత్తపల్లి మండలం జొన్నల బోగడ తండాకు చెందిన బాలు పొట్టకూటికోసం నగరానికి వచ్చి కేపీహెచ్‌బీ–2లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గుడిసె వేసుకుని కుటుంబంతో జీవనం సాగిస్తున్నాడు. బాలు కూలీ పనులు చేస్తుండగా భార్య సోనీ అదే పాఠశాలలో ఆయాగా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు రాత్లావత్‌ చరణ్‌ (10) అదే పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు.

తరగతులు జరగకపోవడంతో ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నాడు. ఆదివారం కూలీకి వెళ్లిన బాలు రాత్రి ఇంటికొచ్చే సరికి చరణ్‌ టీవీ చూస్తూ కూర్చున్నాడు. కుమారుడు ఆన్‌లైన్‌ తరగతులకు హాజర కాకుండా ఎప్పుడూ టీవీ చూస్తునే ఉంటున్నాడని బాలుతో సోని చెప్పింది. కాసేపటి తర్వాత బాలు తన కుమారుడిని దుకాణానికి పంపాడు. అక్కడి నుంచి వచ్చిన చరణ్‌పై తండ్రి బిగ్గరగ అరుస్తూ నువ్వు రోజూ టీవీ చూస్తు ఆన్‌లైన్‌ తరగతులకు హాజరు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత చరణ్‌ను కొట్టుకుంటూ గుడిసె బయటకు నెట్టుకొచ్చాడు. తల్లి అడ్డుకోయినా వినకుండా కొడుతూనే ఉన్నాడు. పాఠశాలకు పెయింటింగ్‌ వేసేందుకు తీసుకువచ్చిన టార్పంటాయిన్‌ ఒక్కసారిగా చరణ్‌పై గుమ్మరించి నిప్పంటించాడు. మంటలంటుకున్న చరణ్‌ వేడికి తట్టుకోలేక పాఠశాల సమీపంలో ఉన్న గుంతలో పడిపోయాడు. స్థానికులు గుర్తించి చరణ్‌ను బయటకు తీసి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
50 శాతం శరీరం కాలిపోయిందని బాలుడి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనలో చిన్నారికి తన భర్త నిప్పంటించలేదని.. కోపంతో పిల్లాడే అలా చేసుకున్నాడని సోని తెలపడం కొసమెరుపు.

Read more RELATED
Recommended to you

Latest news