భారతదేశంలో రైతుల నిరసనపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఏడుగురు అమెరికా కాంగ్రెస్ సభ్యులు విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపీయోకు లేఖ రాసారు. ఇండో-అమెరికన్ కాంగ్రెస్ మహిళ ప్రమీలా జయపాల్ తో సహా ఏడుగురు అత్యంత ప్రభావవంతమైన అమెరికా శాసనసభ్యుల బృందం విదేశాంగ కార్యదర్శి మైక్ పోంపీయోకు లేఖ రాసింది. భారతదేశంలో రైతుల నిరసన సమస్యను వారు తమ లేఖలో ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేసారు.
ఇది పంజాబ్ తో ముడిపడి ఉన్న సిక్కు అమెరికన్లకు ప్రత్యేక ఆందోళన కలిగించే అంశం అని లేఖలో ప్రస్తావించారు. ఈ నిరసనలు భారతీయ అమెరికన్లను ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని డిసెంబర్ 23 నాటి పోంపీయోకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. భారత్ లో రైతులకు సంబంధించి అనవసర వ్యాఖ్యలను తాము చూసామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ వెల్లడించారు.
ఇటువంటి వ్యాఖ్యలు అనవసరమైనవి, ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశం యొక్క అంతర్గత వ్యవహారాలకు సంబంధించినవి అని ఆయన అన్నారు. చాలా మంది భారతీయ అమెరికన్లు పంజాబ్ లో కుటుంబ సభ్యులు మరియు పూర్వీకుల భూమిని కలిగి ఉన్నారని లేఖలో ప్రస్తావించారు. భారతదేశంలో వారి కుటుంబాల శ్రేయస్సు కోసం ఆందోళన చెందుతున్నారు అని… ఈ తీవ్రమైన పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వ్యవహరించాలని సూచించారు.