కర్ణాటక శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘శక్తి యోజన’ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలు తెగ వాడేస్తున్నారు. ఇదే అవకాశంగా భావించి దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలను చూసేందుకు క్యూకడుతున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగి సీట్ల కోసం సిగపట్లు, తోపులాటలు, కొట్లాటలకు దిగుతున్నారు. తాజాగా, ఓ బస్సులో మహిళలు జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జూన్ 11న శక్తి స్కీమ్ పథకం ప్రారంభమైనప్పటి నుండి కోట్లాది మంది మహిళలు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించారు. వచ్చే ఎన్నికల్లో ఇది తమకు ఓటు బ్యాంకుగా మారుతుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ పథకం తర్వాత మహిళల నుండి వస్తున్న ఆదరణ పట్ల కాంగ్రెస్ ఆనందంగా ఉంది. అయితే ఈ పథకం వల్ల రాష్ట్ర ఖజానాకు ఏడాదికి రూ.4,400 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. మహిళల ఉచిత ప్రయాణం కారణంగా దేవాలయాల వద్ద రద్దీ పెరగడంతో పాటు, ధర్మస్థల, కుక్కే సుబ్రమణ్య, కొల్లూరు మూకాంబిక, కటీల్ దుర్గాపరమేశ్వరి, ఉడిపి కృష్ణ దేవాలయం, శృంగేరి, గోకర్ణ, హొరనాడు వంటి ఆలయ ప్రాంతాల్లో వ్యాపారాలు పెరిగాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ అధికారులు ప్రత్యేకంగా వారాంతాల్లో భక్తులకు అదనపు ఆహారాన్ని వండి పెట్టాల్సి వస్తోంది.