హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీపై షర్మిల క్లారిటీ

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ రాజీనామాతో హుజూరాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. దీంతో హుజూరాబాద్‌లో త్వరలోనే ఉపఎన్నిక జరగనుంది. ఈ ఉపఎన్నికపై అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే ప్రచారం కొనసాగిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వైఎస్‌ షర్మిల కొత్తగా పెట్టిన పార్టీ కూడా ఈ ఉప ఎన్నికలో పాల్గొంటుందని రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్‌ షర్మిల కీలక ప్రకటన చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ పోటీ చేయబోదని స్పష్టం చేశారు.

హుజురాబాద్ ఎన్నికల వల్ల అసలు ఉపయోగం ఉందా? అని పేర్కొన్న ఆమె… హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో పోటీ చేయబోమని తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? దళితులకు మూడు ఎకరాల భూమి వస్తుందా? అని ప్రశ్నించారు. ఇవన్నీ చేస్తామని చెబితే అప్పుడు మేం కూడా పోటీచేస్తామని.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నిక మాత్రమేనని తెలిపారు షర్మిల.