నిరుద్యోగుల సమస్యలపై షర్మిల దీక్ష.. నేడే.

తెలంగాణ రాజకీయాలు వైయస్సార్ తెలంగాణ పార్టీ రాకతో మరింత ఆసక్తికరంగా మారాయి. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలు వైయష్ షర్మిల ప్రారంభించిన పార్టీ కావడంతో ఆ ఆసక్తి ఇంకా పెరిగింది. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకే పార్టీ పెట్టానని షర్మిల అభివర్ణించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారుని, కేసీఆర్ నాయకత్వాన్ని విమర్శలు చేసారు. తెలంగాణలో ఉన్న సమస్యల మీద పోరాడతానని చెప్పిన షర్మిల, తాజాగా నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం దాకా తీసుకెళ్ళేందుకు దీక్ష చేపట్టనున్నారు.

మహబూబాబాద్ లో ఈ రోజు ఉదయం దీక్ష ప్రారంభం కానుంది. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడంలేదని ఆత్మహత్య చేసుకున్న బోడ సునీల్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం, ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే వేయాలని, నిరుద్యోగుల సమస్యలు తీర్చాలని దీక్ష చేపట్టనున్నారు. మరి ఈ దీక్ష ఫలించి ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చి నిరుద్యోగుల సమస్యలు తీరతాయా అన్నది చూడాలి.