తండ్రీ తనయులు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. ఈ పిక్చర్ నుంచి ఆదివారం ‘భలే భలే బంజారా’ సాంగ్ ప్రోమో విడుదలైంది. ఫుల్ వీడియో ఈ నెల 18న సాయంత్రం 4.05 గంటలకు విడుదల కానుంది. ఇక ఈ సాంగ్ ను కొరియోగ్రఫీ చేసిన శేఖర్ మాస్టర్ ‘భలే భలే బంజారా’ సాంగ్ ఎలా వచ్చిందనే విషయమై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
తాను గతంలో ‘ఖైదీ నెంబర్ 150’ ఫిల్మ్ లో చిరంజీవి, రామ్ చరణ్ లను కలిపి ఒక స్టెప్ కొరియోగ్రాప్ చేశానని, కానీ, ఈ సారి ‘ఆచార్య’లో ఫుల్ సాంగ్ చేశానని కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.
ఈ అవకాశం వచ్చినందుకు తను ఆనందపడ్డానని, సంపూర్ణంగా సద్వినియోగం చేసుకున్నానని అన్నారు.
కంపోజిషన్ చేస్తున్న సమయంలో సాంగ్ చూసేందుకు ఇండస్ట్రీ నుంచి ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ప్రతీ రోజు చాలా మంది వచ్చారని వివరించారు శేఖర్.
తను కంపోజ్ చేసిన పాట చూసి ఎడిట్ చేసినప్పటికీ ఇప్పటికీ తాను విడుదలైన ప్రోమో చూస్తానని శేఖర్ మాస్టర్ చెప్పారు. వెండితెరపైన రామ్ చరణ్, చిరంజీవి ల డ్యాన్స్ చూడటానికి రెండు కాళ్లు చాలవని, సాంగ్ మామూలుగా ఉండదని పాటపైన ఇంకా ఆసక్తిని పెంచారు శేఖర్. డ్యాన్స్ లో చిరంజీవిది ఒక గ్రేస్ అయితే, చరణ్ ది ఓ యూనిక్ స్టైల్ అని శేఖర్ మాస్టర్ వివరించారు. ఈ నెల 29న ‘ఆచార్య’ సినిమా విడుదల కానుంది.