మహారాష్ట్రలో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు సందర్భంగా రాజకీయాలు కొత్తరూపుదాల్చుతున్నాయి. తగిన సంఖ్యాబలం లేనందున ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ ముందుకు రాకపోవడంతో గవర్నర్ శివసేనను ఆహ్వానించిన తర్వాత పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రంగంలోకి దిగిన శివసేన ప్రభుత్వ ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మద్దతుగా కూడగట్టేందుకు నానాతంటాలు పడుతోంది.
ఈ క్రమంలోనే కేంద్ర పదవుల్లోని తమ నాయకుల చేత రాజీనామా చేపిస్తోంది. ఈ మేరకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అరవింద్ సావంత్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ‘తామెందుకు ఇంకా ఢిల్లీలో ఉండాలి. కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి.. మోదీ ప్రభుత్వం నుంచి బయటకు వస్తున్నా’ అంటూ సోమవారం ఉదయం ప్రకటించి సంచలనం రేపారు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్, ఎన్సీపీలు గేమ్ మొదలుపెట్టాయి. అనేక షరతులు విధిస్తున్నాయి.
కాగా ప్రభుత్వ ఏర్పాటులో తాము మద్దతు తెలపాలంటే శివసేన ఎన్డీయే కూటమి నుంచి పూర్తిగా బయటకు రావాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ షరతు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా కీలక పదవి ఇవ్వాలని కూడా ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది. శివసేన నేత ఉద్దవ్‌ఠాక్రే సీఎం అవ్వాలంటే.. శరద్‌పవార్ డిప్యూటీ సీఎం కావాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్రలో శివసేన ఎలాంటి వ్యూహం అమలు చేస్తుందన్నది మరింత ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ గేమ్ మొదలుపెట్టింది. మంత్రివర్గంలో ఆరుగురికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నది మరింత ఉత్కంఠ రేపుతోంది. అయితే.. హిందుత్వ పార్టీ అయిన శివసేనను కట్టడి చేయాలంటే.. ఇలాంటి షరతులు అవసరమని, లేనిపక్షంలో తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని కాంగ్రెస్, ఎన్సీపీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా సీఎం కావాలని చూస్తున్న శివసేన ఈ షరతులు ఒప్పుకుంటుందో లేదో చూడాలి మరి.