ఈ దీపావళికి మీరు బంగారం కొనాలా…?

ఓ వైపు కొవిడ్‌ విజృంభణ, ఆర్థిక వ్యవస్థ మందగమనం.. మరోవైపు రెక్కలొచ్చిన ధరలు.. ఫలితంగా దేశంలో బంగారం గిరాకీ అంతకంతకూ పడిపోయింది. కొవిడ్‌ 19తో లాక్‌డౌన్‌ అమల్లోకి రావడం, అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్చితి వల్ల ధరలు అమాంతం పెరగడంతో.. పసిడి గిరాకీ తగ్గిందని తెలిపింది డబ్ల్యూజీసీ. సాధారణంగా జులై – సెప్టెంబరు త్రైమాసికంలో శ్రావణమాసం పెళ్లిళ్లు, పండగలతో బంగారం కొనుగోళ్లు విపరీతంగా ఉండేవి. అయితే, ఈ సారి వైరస్‌ భయంతో పెళ్లిళ్లు, పండగలు అంతంతమాత్రంగానే జరిగాయ్‌. మరోవైపు భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం వంటి కొవిడ్‌ ఆంక్షలతో వినియోగదారులు బంగారం రిటైల్‌ దుకాణాలకు వెళ్లేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు.

అయితే ఏప్రిల్‌-జూన్‌తో పోలిస్తే.. మూడో త్రైమాసికంలో పసిడికి కాస్త మెరుగైన డిమాండ్‌ లభించింది. రెండో త్రైమాసికంలో పసిడి డిమాండ్‌ ఏకంగా 70శాతం పడిపోయి 64 టన్నులకు మాత్రమే పరిమితమైంది. మరోవైపు కొనుగోళ్లు తగ్గినప్పటికీ పసిడిలో పెట్టుబడులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయ్. జులై-సెప్టెంబరులో భారత్‌లో బంగారం పెట్టుబడులు 52శాతం పెరిగి 33.8 టన్నులుగా ఉన్నాయి.ప్రస్తుతం కొవిడ్‌ పరిస్థితులు చక్కబడుతుండటంతో పాటు దసరా, ధనత్రయోదశి, దీపావళిని పురస్కరించుకుని నాలుగో త్రైమాసికంలో పసిడి కొనుగోళ్లు మళ్లీ పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు మార్కెట్ నిపుణులు.