బంపర్ ఆఫర్ కొట్టేసిన సిద్దార్థ

సిద్దార్థ.. లవర్ బాయ్ ఒకప్పుడు. టాలీవుడ్, కోలీవుడ్‌లో క్రేజ్ మామూలుగా ఉండేదికాదు. తెలుగులో నువ్వొస్తానంటే నేనొద్దంటానా..బొమ్మరిల్లు, కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి సినిమాలతో ఎక్కడికో వెళ్లిపోయాడు. అయితే ఎంత స్పీడ్‌గా కెరీర్లో పైకి దూసుకెళ్లాడో.. అంతే స్పీడ్‌గా తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయాడు. అడపాదడపా తమిళ్ డబ్బింగ్ మూవీలు చేస్తున్నా పెద్దగా ప్రయోజనం లేకుండాపోయింది. సిద్ధార్థ్ పని అయిపోయినట్టే అనుకుంటున్న సమయంలో మళ్లీ తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

సిద్దార్థ ప్రస్తుతం తెలుగులో ‘మహాసముద్రం’ అనే సినిమాలో చేస్తున్నారు. మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్‌తో కలిసి నటించనున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ ఇద్దరిలో ఒకరు నెగిటివ్ రోల్లో కనిపించనుండగా అది సిద్దార్థనా లేక శర్వానా అన్నది సస్పెన్స్‌గానే ఉంది. ఇప్పుడు ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే మరో సినిమాతో సిద్దార్థ తెరపైకి వస్తున్నారు.

ఇండస్ట్రీలో బయోపిక్‌ల జోరు పెరిగిన ఈ క్రమంలోనే భారత్ దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రావిడ్ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించే ప్రయత్నాలు సాగుతున్నాయి. అయితే రాహుల్ క్యారెక్టర్ కోసం సిద్దార్ధను ఎంపిక చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కథ విన్న వెంటనే ద్రావిడ్ ఓకే చెప్పగా ఇప్పుడు సిద్ధార్థతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం. అధికారిక ప్రకటన రాకముందే ఈ సినిమాకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.