ముక్కోటిని ఏ దేవాలయాల్లో ఎలా చేస్తారో తెలుసా ?

-

ముక్కోటి ఏకాదశి అంటే తెలియని భక్తులు ఉండరు. ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పరితపిస్తారు. అయితే రాష్ట్రంలోని ఆయా దేవాలయాల్లో ఉత్తర ద్వారా దర్శనం రోజు చేసే ప్రత్యేక పూజల విశేషాలు తెలుసుకుందాం…

వైష్ణవ దేవాలయాలలో మామూలు రోజులలో అయితే ఉత్తరద్వారాలను మూసి ఉంచుతారు. ముక్కోటి ఏకాదశిరోజున మాత్రం తెరచి ఉంచుతారు. మన రాష్ట్రంలోని తిరుపతి, భద్రాచలం మొదలైన క్షేత్రాలలో వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల రద్దీ విపరీతంగా ఉంటుంది. తిరుపతిలో ఈరోజు శ్రీవారిసన్నిథిన రావత్తు తోడక్కం జరుగుతుంది. నమ్మాళ్వారు విరచితమయిన భగవద్విషయమనబడే దివ్యప్రబంధంలోని నాలుగవ ఆయిరం అధ్యయనం జరుగుతుంది. వేదపారాయణం తోడక్కం తరువాత జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీవారి దేవస్థానం చుట్టూవున్న చూళిక ద్వారాలు తెరుబడుతాయి. భక్తులు ఈ చూళిక నుంచి ప్రదక్షిణలు చేస్తుంటారు.

భద్రాచల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశిని అధ్యయనోత్యవాలని పిలుస్తారు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశీ మహోత్సవాలు ధను: శుద్ధ తదియతో ప్రారంభమయి ఏకాదశితో సమాప్తమవుతాయి. ఏకాదశికి ముందు పదిరోజులను అధ్యయనోత్సవాలని అంటారు. ఈ అధ్యయనోత్సవాల సమయంలో ధనుశ్శుద్ధ విదియ నుండి ధనుశ్శుద్ధ దశమి వరకు రోజుకొక అవతారం చొప్పున స్వామిని దశావతారాలతో అలంకరించి మధ్యాహ్నసమయంలో కళ్యాణమండప పందిరిలో వేంచేసి చేస్తారు. అనంతరం స్వామి తిరువీథి సేవకు బయలుదేరుతారు. ఏకాదశికి ముందురోజైన దశమినాటి సాయంత్రం గోదావరినదిలో స్వామివారి తెప్పోత్సవం జరుగుతుంది. ఆ తరువాత పదిరోజులు మొక్షోత్సవాలు నిర్వహించబడతాయి. ఈ ఇరవై ఒక్కరోజులలో చతుర్వేద పారాయణం, నాలాయిర దివ్యప్రబంధం పారాయణం చేయబడుతుంది. ఈ ఉత్సవాలను చూసి తరించేందుకు దేశం నలుమూలల నుండి భక్తజన సందోహం తరలి వస్తుంటారు.

వీటితోపాటు ద్వారకతిరుమల, సింహాచలం, ఆహోబిలం, యాదాద్రి, హైదరాబాద్‌ జియాగుడా రంగనాథ దేవాలయం, చిలుకూరు తదితర వైష్ణవ దేవాలయాల్లో విశేషంగా ఈ ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా రాష్టరలోని ప్రతిదేవాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఉపవాసంతో ఏం ఫలితం ?

ఏకాదశిరోజున ఉపవాసాన్ని పాటించాలి. ఈ రోజున ఉపవాసాన్ని పాటించడం వల్ల సూర్య, చంద్రగ్రహణ సమయంలో చేసే దానం, అశ్వమేథయాగం చేసిన ఫలితాలకంటే అధికపలం లభిస్తుంది. ఉపవాసం చేయలేనప్పుడు వాయుభక్షణం, అదీ పాటించకలేకపోతే నీరు, పాలు, పండ్లను తీసుకోవచ్చు. అలా కుదరనప్పుడు ఒక్కపొద్దు అంటే, ఒంటిపూట భోజనం చేయవచ్చు. సుఖ సంతోషాలను పంచే పండుగ వైకుంఠ ఏకాదశి.
– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news