డెంగీ జ్వరం వచ్చాక కనీసం 3 నుంచి 5 రోజులకు గానీ ఆ లక్షణాలు కొందరిలో బయట పడవు. వారు ఆరోగ్యంగా ఉన్నట్లే కనిపిస్తారు. కానీ రోజులు గడిచే కొద్దీ వారిలో డెంగీ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటకు కనబడుతాయి.
అసలైన వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఎక్కడ చూసినా డెంగీ, టైఫాయిడ్, మలేరియా తదితర విష జ్వరాలతో హాస్పిటల్స్‌లో చేరుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అయితే టైఫాయిడ్, మలేరియా జ్వరాలు వస్తే వెంటనే విపరీతమైన జ్వరంతో ఆ లక్షణాలు తెలుస్తాయి. కానీ డెంగీ జ్వరం వచ్చాక కనీసం 3 నుంచి 5 రోజులకు గానీ ఆ లక్షణాలు కొందరిలో బయట పడవు. వారు ఆరోగ్యంగా ఉన్నట్లే కనిపిస్తారు. కానీ రోజులు గడిచే కొద్దీ వారిలో డెంగీ లక్షణాలు ఒక్కొక్కటిగా బయటకు కనబడుతాయి. అయితే వాటిని ముందుగానే పసిగడితే సరైన సమయంలో స్పందించి వెంటనే చికిత్స తీసుకుని ప్రాణాలను కాపాడుకునేందుకు అవకాశం ఉంటుంది. మరి డెంగీ ఎలా వస్తుందో, దాని లక్షణాలు ఎలా ఉంటాయో, డెంగీ వచ్చిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
డెంగీ ఎలా వస్తుంది..?
డెంగీ వైరస్ కలిగి ఉన్న దోమలు మనల్ని కుట్టడం ద్వారా డెంగీ జ్వరం వస్తుంది. ఈ జ్వరం వచ్చిన వారిలో వైరస్ వారి శరీర రోగ నిరోధక వ్యవస్థపై అటాక్ చేస్తుంది. దీని వల్ల ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా తగ్గుతుంది. దీంతో శరీర రోగ నిరోధక వ్యవస్థకు ఆ వైరస్‌పై పోరాడే శక్తి తగ్గుతుంది. క్రమంగా వైరస్ తీవ్రత ఎక్కువై జ్వరం పెరుగుతుంది. దాంతోపాటు పలు ఇతర లక్షణాలు కూడా మనకు కనిపిస్తాయి.
డెంగీ వచ్చిన వారిలో కనిపించే లక్షణాలు ఇవే…
డెంగీ వచ్చిన వారిలో సహజంగానే 3 నుంచి 5 రోజుల వరకు ఆ లక్షణాలు కనిపించవు. ఇక కొందరికి ఆ జ్వరం వచ్చిన వెంటనే పలు లక్షణాలు కనిపిస్తాయి. డెంగీ వచ్చిన వారికి 104 ఫారెన్‌హీట్ డిగ్రీల జ్వరం ఉంటుంది. అలాగే తలనొప్పి, కండరాలు, ఎముకలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. వికారంగా వాంతులు వచ్చినట్లు అనిపిస్తుంది. కొందరిలో వాంతులు కూడా అవుతాయి. కళ్ల వెనుక నొప్పిగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఉమ్మినీటి గ్రంథులు వాపునకు లోనై కనిపిస్తాయి. శరీరంపై కొందరిలో ఎర్రగా దద్దుర్లు కూడా వస్తాయి.
అయితే ఒకసారి డెంగీ వచ్చి తగ్గినా.. మళ్లీ ఆ జ్వరం రాదని గ్యారంటీ ఏమీ లేదు. ఎందుకంటే.. డెంగీ జ్వరం తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తుంది. అలాంటప్పుడు కనిపించే లక్షణాలు మరింత తీవ్రతరంగా ఉంటాయి. డెంగీ జ్వరం రెండో సారి లేదా మూడో సారి వచ్చిన వారిలో కొందరికి ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతాయి. అలాంటి వారిలో ప్లేట్‌లెట్ల సంఖ్య వేగంగా తగ్గుతుంటుంది. అలాగే తీవ్రమైన జ్వరం ఉంటుంది. దాంతో షాక్ కూడా రావచ్చు. అలాగే తీవ్రమైన కడుపునొప్పి, ఆగకుండా వాంతులు కావడం, చిగుళ్లు, ముక్కు నుంచి రక్తస్రావం అవడం, మూత్రం, మలం, వాంతిలో రక్తం పడడం, చర్మం కింద గాయాలు కావడం, రక్తస్రావం కనిపించడం, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవడం లేదా వేగంగా శ్వాస తీసుకోవడం, చల్లని చర్మం, తీవ్రమైన అలసట, విసుగు ఉంటాయి. ఈ లక్షణాలు కనిపిస్తే డెంగీ జ్వరం తీవ్రత ఎక్కువగా ఉందని అర్థం చేసుకోవాలి. ఏమాత్రం నిర్లక్ష్యం, ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యున్ని కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి.
డెంగీ వచ్చిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే…
- ఒకసారి డెంగీ జ్వరం వస్తే దాని లక్షణాలు కనిపించేందుకు చాలా వరకు 3 నుంచి 5 రోజుల సమయం పడుతుందని తెలుసుకున్నాం కదా. అయితే ఆ సమయంలో చికిత్స ప్రారంభించే అప్పటి నుంచి వారంలోగా డెంగీ నయం అవుతుంది. అలాగే ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేందుకు కనీసం మరో 5 రోజుల వరకు సమయం పడుతుంది.
- డెంగీ వచ్చిన వారు తగ్గాక కూడా కనీసం 7 రోజుల పాటు నాన్‌వెజ్ తినకపోవడమే మంచిది. అలాగే తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకోవాలి. ముఖ్యంగా ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటే మంచిది.
- డెంగీ జ్వరం ఉన్నవారు బొప్పాయి పండ్లు లేదా ఆ మొక్క ఆకుల రసాన్ని స్వల్ప మొత్తంలో తీసుకోవడం ద్వారా రక్తంలో ప్లేట్‌లెట్లు పెరిగి త్వరగా కోలుకుంటారు. అలాగే కివీలు, దానిమ్మ పండ్లను తీసుకున్నా శరీర రోగ నిరోధక శక్తి పెరిగి పేషెంట్లు త్వరగా కోలుకుంటారు.
- డెంగీ ఉన్నవారు మళ్లీ దోమలు కుట్టకుండా దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. మస్కిటో రీపెల్లెంట్లు, దోమ తెరలను వాడాలి. అలాగే ఇంట్లో, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
- డెంగీ దోమలు ఎక్కువగా పగటి పూట కుడతాయని చెబుతారు. అయినప్పటికీ రాత్రి పూట కూడా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలి.
- సాధారణంగా కుటుంబంలో ఒకరికి డెంగీ వస్తే మిగిలిన అందరికీ ఆ వ్యాధి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అంటే.. అది అంటు వ్యాధి కాదు. కానీ ఒకరిని కుట్టిన డెంగీ దోమలు ఇంట్లో ఉన్న మిగిలిన వారినీ విడిచిపెట్టవు కదా. అందుకని ఇంట్లో మిగిలిన కుటుంబ సభ్యులు కూడా అసలు ఏ దోమా కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
- చిన్నారులు, వృద్ధులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కనుక వారి పట్ల పెద్దలు మరింత జాగ్రత్త పాటించాలి. చిన్నారులు పడుకున్నాక వారిపై మస్కిటో నెట్‌ను పెట్టాలి. వారి చేతులు, కాళ్లకు సాక్సులు వేయాలి. దోమలు కుట్టకుండా చూసుకోవాలి.
- దోమలు కుట్టకుండా ఉండాలంటే కురచ దుస్తులు కాకుండా పొడవైన దుస్తులు ధరించాలి.
- డెంగీ వచ్చిన వారికి సహజంగానే హాస్పిటల్‌లో యాంటీ బయోటిక్స్ ఇస్తారు. అయితే ఖర్చు ఎక్కువ అని చెప్పి కొందరు పూర్తి డోసు తీసుకోకుండానే జ్వరం తగ్గింది కదా అని చెప్పి ట్రీట్‌మెంట్ మానేస్తారు. అలా చేయరాదు. మధ్యలో ఆపేస్తే మళ్లీ మొదటి నుంచి చికిత్స తీసుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని వారు గ్రహించాలి.
- డెంగీ వచ్చిన వారు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన పనిలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకుంటే కచ్చితంగా ఆ వ్యాధి తగ్గుతుంది కనుక ఆ విషయంలో నిర్లక్ష్యం వహించకుండా వెంటనే స్పందిస్తే ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకోవచ్చు.