వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని పలు గ్రామాల్లో రాష్ట్ర మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌కు రెండు సార్లు అధికారం ఇచ్చారు. ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఇది ఏమైనా దేవుని గుళ్లో ప్రసాదమా ఇవ్వడానికి. పనిచేసే ప్రభుత్వానికి, సమర్ధవంత పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌కే మూడోసారి పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ దశ మారిందని పేర్కొన్నారు. తెలంగాణకు ముందు తరువాత మారిన జీవన పరిస్థితులు బేరీజును వేసుకుని మరోసారి అవకాశం ఇవ్వాలని ఓటర్లకు సూచించారు. సాగునీటికి, కరెంట్‌కు డోకా లేదని, పంటకు ఎదురు పెట్టుబడి ఇచ్చిన ఘనత బీఆర్‌ఎస్ దేనని అన్నారు. పంటలను కొని నేరుగా రైతుల ఖాతాలో జమ చేస్తున్నది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని వెల్లడించారు. 50 ఏండ్ల పాలనలో ఎన్నడూ సాగునీళ్లు ఇవ్వని, ప్రజల వలసలును పట్టించుకోని కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. సింగోటం నుంచి కాలువ నిర్మాణానికి రూ.150 కోట్లతో పనులు నడుస్తున్నాయని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాత ప్రభుత్వమని మరోసారి స్పష్టం చేశారు. పింఛన్లు, రైతుబంధు పెంచడం తో పాటు సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వమే భరించి రూ. 400 లకే సిలిండర్, భూమి లేని వాళ్లకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా వర్తింపు పథకాలు అందజేస్తామని మంత్రి అన్నారు.