జనగామ నియోజకవర్గం చేర్యాలలో శనివారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రైతుబంధు వృధా అని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారని అన్నారు. పల్లా రాజేశ్వర రెడ్డిని గెలిపిస్తే రైతుబంధు క్రమంగా రూ.16వేలకు పెంచుతామన్నారు కేసీఆర్. బీఆర్ఎస్ మీ కళ్లముందే పుట్టిన పార్టీ అన్నారు. తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ అన్నారు. కానీ కాంగ్రెస్ చరిత్ర అందరికీ తెలిసిందేనని, తెలంగాణను ముంచిందే ఆ పార్టీ అన్నారు.
58 ఏళ్ల పాటు తెలంగాణకు నష్టం చేసిందన్నారు. 2004లో మనతో పొత్తు కారణంగానే కాంగ్రెస్… తెలంగాణలో, ఢిల్లీలో అధికారంలోకి వచ్చిందని, అయినా రాష్ట్రాన్ని ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. దీంతో తెలంగాణ కోసం అందరం ఉద్యమించామన్నారు. చివరకు కేసీఆర్ చచ్చుడో… తెలంగాణ వచ్చుడో అని తాను ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ సాధించానన్నారు. అంతకుముందు కాంగ్రెస్ పాలన, ఈ పదేళ్ల బీఆర్ఎస్ పాలనను పోల్చుకోవాలన్నారు.
జీవనదుల మధ్య ఉన్న తెలంగాణకు ఎంతో అన్యాయం జరిగిందన్నారు. దగ్గరలోనే ఉన్న బచ్చన్నపేట చెరువులో గత పాలకుల సమయంలో నీళ్లు లేకుండెనని, ఉద్యమం సమయంలో ఇటు నుంచి వెళ్తున్న తాను ఓ సందర్భంలో బచ్చన్నపేటలో ఆగి గొడగొడ ఏడ్చానన్నారు (బాగా ఏడ్చానన్నారు). కానీ ఇప్పుడు అదే బచ్చన్నపేట చెరువులో నిత్యం నీళ్లు ఉంటున్నాయన్నారు. బీఆర్ఎస్ పాలనలో ప్రతి ఇంటికి కాలువ నీరు వచ్చిందని, మంచి నీళ్లు వచ్చాయని, 24 గంటల విద్యుత్ ఇస్తున్నామన్నారు.
ఇటీవల జనగామకు వచ్చి కుక్కలు వచ్చి మొరిగిపోయాయని పల్లా రాజేశ్వర రెడ్డి బాధపడుతున్నారని, కానీ కుక్కలు మొరుగుతూనే ఉంటాయని విపక్షాలను ఉద్దేశించి అన్నారు. కేసీఆర్‌కు పిండం పెట్టాలని అంటున్నారని, కానీ ప్రజలు ఎవరికి పిండం పెట్టాలో నిర్ణయించాలన్నారు. సిద్దిపేట, చేర్యాల కలిసే ఉంటాయని, కాబట్టి చేర్యాల కష్టాలు తనకు తెలుసునన్నారు. ప్రజలు ఓటు వేసే ముందు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్‌ను మూడోసారి గెలిపిస్తే పెన్షన్ మరింతగా పెంచుతామన్నారు.