ఫామ్​హౌస్ కేసు.. వారి అరెస్టు దిశగా పోలీసుల అడుగులు

-

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు నోటీసులకే పరిమితమైన సిట్ ప్రస్తుతం అరెస్టుల దిశగా అడుగులు వేస్తోంది. నలుగురు అనుమానితుల్లో ఇద్దరి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తదుపరి చర్యల కోసం న్యాయనిపుణులతో చర్చిస్తోంది. నలుగురు అనుమానితుల్లో బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేరళ వైద్యుడు డా.జగ్గుస్వామి, భారతీయ ధర్మజనసేన చీఫ్‌ తుషార్‌ ఇప్పటివరకు సిట్‌ ముందుకు రాలేదు.

 

వీరిలో సంతోష్‌ తర్వాత హాజరవుతానని సిట్‌కు సమాచారం ఇవ్వగా.. మిగిలిన ఇద్దరి నుంచి ఎలాంటి స్పందన లేకుండాపోయింది. దీన్నిబట్టి సంతోష్‌ కొంత సమయం కోరి విచారణకు హాజరవుతారని పోలీస్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే తాము సేకరించిన సమాచారాన్ని సంతోష్‌ చెప్పే సమాధానాలతో పోల్చుకొని తదుపరి చర్యలకు దిగనుంది.

జగ్గుస్వామిపై ఇప్పటికే లుక్‌ అవుట్‌ నోటీస్‌ జారీ చేసిన పోలీసులు.. తాజాగా తుషార్‌పైనా జారీ చేశారు. ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నించిన కేసులో జగ్గుస్వామి పాత్ర కీలకం కాగా అతడు కర్ణాటకలోని షిమోగాలో తలదాచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడు దొరికితే కేసును మలుపుతిప్పే ఆధారాలు లభిస్తాయనే అంచనాతో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news