పేపర్ లీకేజీ కేసులో ఇవాళ సిట్​ ముందుకు TSPSC కార్యదర్శి

-

TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రధాన నిందితులతో పాటు టీఎస్పీఎస్సీలో పలువురు ఉద్యోగులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు టీఎస్పీఎస్సీ కార్యదర్శితో పాటు మరో సభ్యుడికి సిట్ నోటీసులు జారీ చేసింది.

సిట్ నోటీసుల నేపథ్యంలో ఇవాళ అధికారుల ముందు విచారణకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, మరో సభ్యుడు లింగారెడ్డి హాజరు కానున్నారు. కాన్ఫిడెన్షియల్ విభాగం మొత్తం కార్యదర్శి ఆధీనంలో ఉంటుంది. ప్రశ్నపత్రాల తయారీ, భద్రత, పరీక్షల నిర్వహణ తదితర విషయాల గురించి కమిషన్‌ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె వద్ద పనిచేస్తున్న ప్రవీణ్‌ ప్రశ్నపత్రాలు కొల్లగొట్టినందున ఆ కోణంలోనూ అనితా రామచంద్రన్‌ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రవీణ్‌ను గ్రూప్-1 పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చినప్పటికీ, విధుల నుంచి ఎందుకు తప్పించలేదన్న ప్రశ్నలకు కమిషన్‌ కార్యదర్శి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

రమేశ్ అనే వ్యక్తికి కూడా లీకైన గ్రూప్-1 ప్రశ్నపత్రం అందింది. కమిషన్ సభ్యుడు లింగారెడ్డి వద్ద రమేష్‌ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. గ్రూప్-1 పరీక్ష రాస్తున్నప్పటికీ రమేశ్​ను ఎందుకు విధుల్లో కొనసాగించారనే కోణంలో సిట్ అధికారులు లింగారెడ్డిని ప్రశ్నించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news