పార్లమెంట్ లో పర్సనల్ ఫైట్.. స్మృతి Vs సోనియా

-

పార్లమెంట్ లో ధరల పెంపు, ఎంపీల సస్పెన్షన్ పై కేంద్రంపై విపక్షాలు విరుచుకుపడుతున్న వేళ ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలపై భాజపా నేతలు స్పందించారు. రాష్ట్రపతికి, దేశానికి సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ లో ఆందోళనకు దిగారు. కొద్దిరోజులుగా విపక్షాలు చేస్తున్న ఆందోళనలో ఈ సంఘటనతో మరుగున పడిపోయాయి. సోనియా లోక్​సభలో తమ ఎంపీలను, ప్రత్యేకించి ఒకరిని(స్మృతి ఇరానీని) బెదిరించారని నిర్మలా సీతారామన్ ఆరోపించగా.. రెండు వర్గాల మధ్య పెద్ద రాద్ధాంతమే జరిగింది.

రాష్ట్రపతిపై అధీర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించిన భాజపా.. నేరుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపైనే గురిపెట్టింది. రాష్ట్రపతికి, దేశానికి ఆమె క్షమాపణ చెప్పాల్సిందేనని కమలదళం పట్టుబడుతోంది.అధీర్ రంజన్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు, అధికార పక్షం నిరసనల నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సోనియా గాంధీ ప్రయత్నించారు. లోక్ సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడగానే సోనియా గాంధీ.. ట్రెజరీ బెంచ్ వద్దకు వెళ్లారు. ఈ అంశంలోకి తనను ఎందుకు లాగుతున్నారని అక్కడ ఉన్న భాజపా నేత రమాదేవిని అడిగారు.ఈ సమయంలో స్మృతి ఇరానీ.. మధ్యలో కలగజేసుకున్నారు. సోనియా గాంధీని చూపిస్తూ అధీర్ వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేశారు. తొలుత స్మృతి ఇరానీని.. సోనియా పట్టించుకోలేదు. అయితే, కాసేపటికి మంత్రివైపు చూసి కోపంగా మాట్లాడారు.

ఈ విషయంపై స్పందించిన రమాదేవి.. “‘నా పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారు? నా తప్పు ఏంటి?’ అని సోనియా నన్ను అడిగారు. ‘కాంగ్రెస్ లోక్​సభాపక్షనేతగా చౌదరిని ఎంపిక చేయడమే మీరు చేసిన తప్పు’ అని నేను సోనియాతో చెప్పా” అని మీడియాకు వివరించారు. అయితే, సోనియా గాంధీ లోక్​సభలో కొందరు భాజపా ఎంపీలను బెదిరించారని సంచలన ఆరోపించారు కేంద్ర మంత్రి, భాజపా నాయకురాలు నిర్మలా సీతారామన్​.

“లోక్ సభలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సోనియా గాంధీ.. మా పార్టీ సీనియర్​ నాయకురాలు రమా దేవి దగ్గరకు వచ్చారు. అప్పుడు మా పార్టీకే చెందిన మరికొందరు అక్కడకు వెళ్లగానే.. ‘నువ్వు(స్మృతి ఇరానీ)​ నాతో మాట్లాడకు’ అంటూ సోనియా గాంధీ లోక్ సభలో మా సభ్యులను బెదిరించే ధోరణిలో అన్నారు. రాష్ట్రపతిపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి అధీర్​ రంజన్​.. క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని వాదిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ.. ‘ఇప్పటికే ఆయన క్షమాపణలు కోరారు.’ అని చెబుతున్నారు. సోనియా దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.”
-నిర్మలా సీతారామన్​, కేంద్ర ఆర్థిక మంత్రి

తాను తప్పు చేశానని దాన్ని ఒప్పుకుంటున్నానని కాంగ్రెస్ లోక్ సభా పక్షనేత అధీర్ రంజన్ చౌదరి అన్నారు. రాష్ట్రపతిని ఉద్దేశపూర్వకంగా ఏం అనలేదని.. ఒకవేళ రాష్ట్రపతికి తప్పుగా అనిపిస్తే.. తాను స్వయంగా ఆమెను కలిసి క్షమాపణలు కోరతానని చెప్పారు. అంతేకాని భాజపా నాయకులకు క్షమాపణ చెప్పనని స్పష్టం చేశారు. ‘కావాలంటే నన్ను ఉరితీయండి. నేను ఏ శిక్షకైనా సిద్ధమే. కానీ మధ్యలో ఆమెను (సోనియా గాంధీ) ఎందుకు ఇందులోకి లాగుతున్నారు.’అని అధీర్​ రంజన్​ చౌదరి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news