వైసీపీ ప్రభుత్వం పై మరోసారి విమర్శలు గుప్పించారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. వైద్యానికి కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడం లేదని ఆరోపించారు. ఒక్కసారి అవకాశమని జగన్ అధికారంలోకి వచ్చాడని, చంద్రబాబు నాకు చివరి అవకాశం ఇమ్మని అడుగుతున్నారని, పవన్ మొదటిసారి అవకాశం ఇమ్మంటున్నారని అన్నారు. మొదటిసారి అవకాశం ఇమ్మంటున్న పవన్ కళ్యాణ్ కు బిజెపి మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు.
ఆయూష్ ను రాష్ట్రంలోని నాడు టిడిపి, నేడు వైసిపి నీరుగార్చాయన్నారు. ఆయుర్వేదానికి, హోమియోపతికి ఎన్టీఆర్, వాజ్ పేయి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. నేడు మోడి ఏకంగా కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసి ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పుకొచ్చారు సోము వీర్రాజు. గోదావరి ప్రక్షాళనకు కేంద్రం 89 కోట్లు కేటాయిస్తే.. రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 కోట్లు కేటాయించలేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో నిధులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. నిధులు విడుదల చేస్తే రాజమండ్రి పరిసర ప్రాంతాల ప్రజలకు ఆరోగ్యం కాపాడిన వారు అవుతారని పేర్కొన్నారు.