చాలా చిన్న దేశం. అయితేనేం, టెక్నాలజీలో చాలా గట్టిది. ఇప్పుడు కరోనా కట్టడిలో అగ్రగామి. ప్రపంచదేశాలకు బుద్ధి చెబుతున్న బుల్లి దేశం.
దక్షిణ కొరియా.. చైనా పక్కనున్న చిన్న దేశం. ఆ దేశంతో సరిహద్దు లేనప్పటికీ మంచి సంబంధాలే ఉన్నాయి. అటు ఉత్తర కొరియాకు చైనాతో చాలా పెద్ద సరిహద్దు ఉంది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు ఆప్తమిత్రుడు. దక్షిణ కొరియా జనాభా దాదాపు 6 కోట్లు. అధ్యక్షుడు మూన్ జే ఇన్. రాజధాని సియోల్ నగరం. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రానిక్ దిగ్గజ కంపెనీలు సామ్సంగ్, ఎల్జీ, కార్ల కంపెనీ హ్యుండయ్ ఇక్కడే ఉన్నాయి. సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో ఉంటుంది దక్షిణ కొరియా.
అటువంటి సౌత్‌కొరియాలో ఒకే ఒక్క మహిళ ముందుగా కరోనా బారిన పడింది. తనకు కరోనా సోకిందని తెలియని ఆమె, విచ్చలవిడిగా తిరగడం, చర్చిల్లో మీటింగ్‌లు పెట్టడం, పార్టీలకు హాజరవడం లాంటివి చేసి, మొత్తానికి దేశాన్ని కరోనా కంట్రీగా మార్చేసింది. డేగూ నగరానికి చెందిన 61 యేళ్ల ఆ మహిళను ఇప్పుడు ‘‘సూపర్ స్ప్రెడర్’’గా అభివర్ణిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ‘‘పేషెంట్ 31’’గా నామకరణం చేసిన ఆ మహిళ, చెప్పినా వినకుండా, చేయాల్సిందంతా చేసేసి, ప్రస్తుతం కరోనా నుండి విముక్తురాలైంది కూడా.
అమెరికా, యూకే, దక్షిణ కొరియాలలో దాదాపు ఒకేసారి కరోనా కేసులు మొదలయ్యాయి (జనవరి ఆఖరి వారంలో). అక్కన్నుంచి ఆయా దేశాల ప్రయాణమెలా ఉందో ఇప్పుడు మనకు తెలుసు. రోజుకి 100 కేసులు మాత్రమే కొరియాలో నమోదవుతోండగా, యూకేలో 4000, అమెరికాలో 30000 కొత్త కేసలు బయటపడుతున్నాయి. ఇది చాలు కదా… దక్షిణ కొరియా ఎంత నిబద్ధతతో కృషిచేస్తోందో తెలియడానికి.
ఇటలీలాగే, ముందు దక్షిణ కొరియా కూడా కరోనా పట్ల కొంత నిర్లక్ష్యం వహించింది, కానీ, ప్రమాద తీవ్రతను పసిగట్టగానే, కఠిన చర్యలు చేపట్టింది. పేషెంట్ 31 వల్ల ఇది వ్యాపిస్తోందని గుర్తించిన ప్రభుత్వం, కరోనా అనుమానితులను, బాధితులను వెంటనే ఫాలో అవడం మొదలుపెట్టింది. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడి అందరినీ పట్టుకుంది. 3టి విధానం (ట్రేస్ – టెస్ట్ – ట్రీట్)లో సమాంతర వ్యవస్థలను పాదుకొల్పి, అనుమానమొచ్చిన ప్రతీవారిని టెస్ట్ చేయడం, పాజిటివ్ అయితే హాస్పిటల్, దగ్గరివారైతే ఐసోలేషన్.. ఇలా మెరుపువేగంతో పనిచేసింది. తన కొవిడ్-19 జాతీయ పరీక్షాసామర్థ్యాన్ని రోజుకి 20వేలకు పెంచుకుంది. దేశవ్యాప్తంగా 43 సంచార పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ విధానాన్ని ప్రస్తుతం అమెరికా, యూకె, కెనడాలు అనుసరిస్తున్నాయి.
దక్షిణకొరియా అంతర్గత మంత్రిత్వశాఖ, కృత్రిమ మేధతో పనిచేసే ఒక యాప్‌ను రూపొందించి విడుదల చేసింది. ఇది క్వారంటైన్ చేసినవాళ్లను నిరంతరం ట్రాక్ చేస్తూ, ఒకవేళ కరోనా లక్షణాలు బయటపడితే వెంటనే ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తుంది. కెసిడిసి (కొరియన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్) ఎప్పటికప్పుడు కరోనా పేషెంట్ల సమాచారాన్ని అత్యంత ఖచ్చితత్వంతో విడుదల చేస్తోంది. దాంతో వైద్యులు, శాస్త్రవేత్తలు, అంటువ్యాధుల నిపుణులు పేషెంట్ల ఆరోగ్య చరిత్రను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నారు. దాంతో కరోనా గమనం, తన మార్పులు, బలహీనతలను గుర్తించే వీలు కలుగుతోంది.
ప్రస్తుతం దక్షిణ కొరియాలో మొత్తం కొవిడ్ కేసులు 10,384 కాగా, అందులో 3,408 కేసులు చికిత్సలో ఉన్నాయి. 6,776 మంది కరోనా బారినుండి విముక్తులై. ఇంటికెళ్లిపోగా, 200 మంది మరణించారు. ఇప్పుడు రోజుకి 20 నుండి 50 మాత్రమే కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఇంత అభివృద్ధి కేవలం విరివిగా పరీక్షలు చేయడం వల్లే సాధ్యమయింది. ‘‘టెస్ట్….టెస్ట్….టెస్ట్….’’ ఇదే ఆ దేశ తారకమంత్రం. ఇప్పటికి 5 లక్షల మందికి పరీక్షలు నిర్వహించింది. ఇంకా కొనసాగుతోంది. భారత్‌లో మాత్రం ప్రస్తుతానికి 1,40,293 పరీక్షలు మాత్రమే చేయగలిగారు. ప్రతీ పదిలక్షల మందికి కొరియా 10వేల టెస్టులు చేయగా, అమెరికా 6వేలు, యూకే 4వేలు, అత్యధికంగా ఫారో ద్వీపదేశం 1,05,458 టెస్టులు చేసాయి (అన్నట్లు ఫారో ద్వీపంలో మొత్తం కేసులే 184). ఇక మన విషయానికొస్తే, ప్రతీ పది లక్షల మందిలో 102 టెస్టులు మాత్రమే చేసారు.
ఇలా, దక్షిణ కొరియా సమయస్ఫూర్తి, నిబద్ధత, అంకితభావం, సరైన కార్యాచరణలతో దూసుకెళ్తూ, మరణమృదంగాన్ని, మంగళవాయిద్యంగా మార్చుకోగలిగింది. ఇంకొన్ని రోజులలో దక్షిణ కొరియా కరోనా-ఫ్రీ దేశంగా అవతరిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
రుద్రప్రతాప్