టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు వస్తున్న పుకార్లపై టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్పందించాడు. రెండు వేర్వేరు ట్వీట్లలో ఫేక్ ఫ్రెండ్స్ మాత్రమే రుమార్లను నమ్ముతారు. నిజమైన స్నేహితులు నిన్ను నమ్ముతారు అంటూ పోస్ట్ చేశాడు.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్ టెస్టు జట్టు గురువారం దక్షిణాఫ్రికా బయల్దేరి వెళ్లింది. డిసెంబర్ 26న సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా, ఇండియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్నది. గాయాల బారిన పడటంతో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టు నుంచి దూరమయ్యారు. నెట్ సెషన్‌లో తొడ కండరాలు పట్టేయడంతో రోహిత్ శర్మను ఎంపిక చేయలేదు. న్యూజిలాండ్‌తో టెస్టు మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ముంజేయి గాయం కావడంతో అతడిని సెలెక్షన్‌కు పరిగణించలేదు.
అయితే, రవీంద్ర ముంజేయికి అయిన గాయం తీవ్రమైందని, ఆపరేషన్ చేయాల్సి రావచ్చని సమాచారం. ఈ కారణంగా నాలుగు నుంచి ఆరు నెలలపాటు క్రికెట్‌కు దూరం కావాల్సిన పరిస్థితి ఉందని తెలిసింది. గాయాల దృష్ట్యా టీ20, వన్డే కెరీర్‌ను కొనసాగించాలనే ఉద్దేశంతో టెస్టు క్రికెట్‌కు జడేజా గుడ్‌బై చెప్పనున్నట్లు వార్తలు వచ్చాయి.
టెస్టు క్రికెట్ నేరుగా ప్రస్తావించకుండా తన రిటైర్మెంట్‌పై వచ్చిన రూమర్లను రవీంద్ర జడేజా ట్విట్టర్ వేదికగా ఖండించారు.
రుమార్లను ఫేక్ ఫ్రెండ్స్ మాత్రమే నమ్ముతారు. నిజమైన స్నేహితులు నిన్ను నమ్ముతారు అనే ఫొటోను రవీంద్ర జడేజా పోస్ట్ చేశారు. సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉన్నదని పేర్కొంటూ భారత్ టెస్ట్ జెర్సీ ఫొటోను కూడా జోడించాడు.
57 టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 89 ఇన్నింగ్స్‌ల్లో 2195 పరుగులు చేశాడు. 108 ఇన్నింగ్స్‌లలో బౌలింగ్ చేసి 232 వికెట్లను తీసుకున్నాడు.టెస్టు కెరీర్‌లో 48 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లను పడగొట్టిన రికార్డు తన పేరిట ఉంది.