అత్యాచార ఆరోపణలపై మంత్రి రాజీనామా…

గోవాలో బీజేపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. అత్యాచార ఆరోపణలో కాబినెట్ లోని మంత్రి రాజీనామా చేశారు. గోవా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మిలింద్ నాయక్ తన పదవికి రాజీనామా చేశారు. అత్యాచార ఆరోపణల నేపథ్యంలో మిలింద్ మంత్రి వర్గం నుంచి తప్పుకున్నారు. తన రాజీనామాను ఆమోదించాలని గవర్నర్ కు రాజీనామా లేఖను పంపారు. అత్యాచారం ఆరోపణలపై దర్యాప్తుకు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశ్యంతోనే రాజీనామా చేస్తున్నట్లు మిలింద్ వెల్లడించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాయలం బుధవారం తెలిపింది. మంత్రి బీహార్ కు చెందిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గిరీష్ చోదన్కర్ ఆరోపణలు చేశారు.

వచ్చే ఏడాది గోవా అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. మరికొన్ని నెలల్లోనే ఎన్నికలకు ఉండటంతో గోవాలో బీజేపీ, కాంగ్రెస్ల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటు ఈసారి ఎన్నికల్లో త్రుణమూల్ కాంగ్రెస్ కూడా బరిలో నిలువనుంది. బెంగాల్ కే పరిమితమైన పార్టీ గోవాలో బోణీ కొట్టాలని చూస్తోంది. ఇటీవల దీదీ గోవాలో పర్యటించారు. అయితే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలోని మంత్రిపై అత్యాచార ఆరోపణలు రావడం.. సదరు మంత్రి రాజీనామా చేయడం బీజేపీకి ఎంతమేర నష్టాన్ని కలిగిస్తాయో ఎన్నికలు అయ్యే వరకు చూడాలి.