చెత్త షాట్ల‌తో వికెట్లు స‌మర్పించుకున్న‌ వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్.. ఆస్ట్రేలియాదే గెలుపు..!

-

టీ20 క్రికెట్ బాగా ప్రాచుర్యంలోకి వ‌చ్చాక‌.. చాలా దేశాల‌కు చెందిన ఆటగాళ్లు వ‌న్డేల‌ను కూడా టీ20ల త‌ర‌హాలో ఆడుతున్నారు. అయితే ప్ర‌తి వన్డే మ్యాచును టీ20 లా ఆడుదామంటే కుద‌ర‌దు. అందుకు ఓపిక ఉండాలి. చెత్త బంతులనే బౌండ‌రీల‌కు త‌ర‌లించాలి. అంతేకానీ.. ప్ర‌తి బంతిని సిక్స్ కొడ‌దామంటే కుద‌ర‌దు. ఫ‌లితం బెడిసి కొడుతుంది. ఇవాళ జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్ లోనూ వెస్టిండీస్ జ‌ట్టుకు ఇలాగే ఫ‌లితం బెడిసి కొట్టింది. దీంతో ఆ జ‌ట్టుపై ఆసీస్ 15 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

కాగా ముందుగా టాస్ గెలిచిన విండీస్ ఆస్ట్రేలియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించ‌గా.. ఆ జట్టు 49 ఓవర్లలో 288 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ల‌లో నాథన్ కౌల్టర్‌నైల్ (60 బంతుల్లో 92 పరుగులు, 8 ఫోర్లు, 4 సిక్సర్లు), స్టీవెన్ స్మిత్ (103 బంతుల్లో 73 పరుగులు, 7 ఫోర్లు)లు మెరుగ్గా ఆడారు. అలాగే విండీస్ బౌలర్లలో కార్లోస్ బ్రాత్‌వైట్‌కు 3 వికెట్లుద‌క్క‌గా, ఒషానే థామస్, షెల్డన్ కాట్రెల్, ఆండ్రూ రస్సెల్ లు తలా 2 వికెట్లు తీశారు. జాసన్ హోల్డర్ 1 వికెట్ తీశాడు.

ఆ త‌రువాత విండీస్ జ‌ట్టు బ్యాటింగ్ ప్రారంభించ‌గా.. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ చెత్త షాట్ల‌ను ఆడి ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను సమ‌ర్పించుకున్నారు. దీంతో ఆ జ‌ట్టుకు చెందిన షై హోప్ (105 బంతుల్లో 68 పరుగులు, 7 ఫోర్లు), కెప్టెన్ జానస్ హోల్డర్ (57 బంతుల్లో 51 పరుగులు, 7 ఫోర్లు, 1 సిక్సర్)లు మాత్రమే రాణించారు. దీంతో విండీస్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 273 పరుగులు మాత్ర‌మే చేసి ఆస్ట్రేలియా చేతిలో ప‌రాజ‌యం పాలైంది. ఇక ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 5 వికెట్లను తీయ‌గా, ప్యాట్ కమ్మిన్స్ 2, ఆడం జంపా 1 వికెట్ ద‌క్కించుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news