ప్రముఖ లెర్నింగ్ యాప్ బైజుస్ త్వరలో టీమిండియాకు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు ఒప్పో, బైజుస్, బీసీసీఐల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది.
టీమిండియా అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది.. భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ధరించే బ్లూ కలర్ జెర్సీ.. ప్రపంచంలోని క్రికెట్ ఆడే ఇతర దేశాల ఆటగాళ్లు ధరించే కలర్‌ఫుల్ జెర్సీల కన్నా.. టీమిండియా ఆటగాళ్ల జెర్సీలే అందంగా కనిపిస్తాయి. అయితే కేవలం వాటికే కాదు, భారత క్రికెట్ జట్టుకు కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త కంపెనీలు స్పాన్సర్లుగా వ్యవహరిస్తుంటాయి. ప్రస్తుతం టీమిండియాకు మొబైల్స్ తయారీదారు ఒప్పో స్పాన్సర్‌గా ఉండగా.. త్వరలోనే దాని స్థానంలో మరొక కొత్త కంపెనీ స్పాన్సర్‌గా రానుంది. ఇంతకీ ఆ కంపెనీ ఏమిటంటే…?
ప్రముఖ లెర్నింగ్ యాప్ బైజుస్ త్వరలో టీమిండియాకు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. ఈ మేరకు ఒప్పో, బైజుస్, బీసీసీఐల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. బైజుస్ బెంగళూరుకు చెందిన ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఆన్‌లైన్ ట్యుటోరియల్ కంపెనీగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పేరు గాంచింది. ఈ క్రమంలోనే త్వరలో టీమిండియా క్రికెటర్ల జెర్సీలపై త్వరలో మనకు ఒప్పోకు బదులుగా బైజుస్ లోగో దర్శనమివ్వనుంది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి సౌతాఫ్రికా టీమిండియా టూర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అప్పటి నుంచే భారత ఆటగాళ్లు కొత్త కంపెనీ లోగో కలిగిన జెర్సీలను ధరించనున్నారు.
కాగా ఒప్పో కంపెనీ 2017లో 5 ఏళ్ల కాలానికి గాను టీమిండియా జెర్సీ హక్కులను సొంతం చేసుకుంది. ఇందుకు గాను ఒప్పో టీమిండియా ఆడే ఒక్క ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్‌కు బీసీసీఐకి రూ.4.61 కోట్లు చెల్లిస్తోంది. అదే ఐసీసీ ఈవెంట్‌లలో జరిగే ఒక్క మ్యాచ్ అయితే ఒప్పో రూ.1.56 కోట్లను చెల్లిస్తోంది. అయితే 2022 వరకు ఒప్పోకు అవకాశం ఉన్నప్పటికీ మధ్యలోనే టీమిండియా స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకోవడం విశేషం..!