భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రి పదవికి గండం ఉందా ? ఆయనను తప్పించి ఆ పదవిని మాజీ ప్లేయర్ రాహుల్ ద్రావిడ్ ( Rahul Dravid )కు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తుందా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. రవిశాస్త్రి కోచ్‌గా పనిచేస్తున్నప్పటి నుంచి భారత్ అనేక విదేశీ సిరీస్ లలో విజయం సాధించింది. ఎంతో పురోగమించింది. అయితే ఐసీసీ టోర్నీల్లో సత్తా చాటలేకపోయింది. ఇక శాస్త్రి పదవీ కాలం కూడా ముగియనుంది. దీంతో ఇకపై శాస్త్రికి కాకుండా కోచ్ పదవిని ద్రావిడ్‌కు అప్పగించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రాహుల్ ద్రావిడ్ గొప్ప బ్యాట్స్‌మెన్. టీమిండియాకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. కానీ కెప్టెన్‌గా పెద్దగా రాణించలేకపోయాడు. అయినప్పటికీ కోచ్‌గా అమోఘమైన సేవలు అందించాడు. ద్రావిడ్ పర్యవేక్షణలో భారత అండర్ 19 క్రికెట్ జట్లు వరల్డ్ కప్ మ్యాచ్‌లలో సత్తా చాటాయి. 2016 జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో భారత జట్టు రన్నర్స్ అప్ గా నిలవగా, 2018లో ఏకంగా విజేతగా నిలిచింది. దీంతో ద్రావిడ్ 2019 జూలై 8 నుంచి బెంగళూరులోని ఎన్‌సీఏ కు హెడ్ గా కొనసాగుతున్నాడు. అయితే ఆ పదవీ కాలం రెండేళ్లు. ఇప్పటికే ముగిసింది. దీంతో ఎన్‌సీఏకు హెడ్ పదవి కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అయితే మరోమారు ఎన్‌సీఏ హెడ్‌గా పనిచేయాలంటే ద్రావిడ్ మళ్లీ దరఖాస్తు చేయాలి. కానీ అలా జరగకపోవచ్చని తెలుస్తోంది. త్వరలో రవిశాస్త్రి పదవీ కాలం కూడా ముగియనుంది. దీంతో శాస్త్రి కోచ్ పదవిని ఇంక పొడిగించకుండా ఆయన స్థానంలో టీమిండియా హెడ్ కోచ్‌గా ద్రావిడ్‌ను ఎంపిక చేస్తారని తెలుస్తోంది. మరి ఈ విషయంలో బీసీసీఐ ఏం చేస్తుందున్నది ఆసక్తికరంగా మారింది.