ఇండియన్ క్రికెటర్లకు బిగ్ రిలీఫ్

భారత క్రికెటర్లకు బీసీసీఐ శుభవార్త తెలిపింది. ఇంగ్లాండ్‌ పర్యటనకు క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం నుండి అనుమతి లభించింది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. అయితే బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ, సెక్రటరీ జే షా మాత్రం ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు వెళ్ళడం లేదని తెలిసింది.

కాగా ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌ వేదికగా జూన్‌ 18 నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆరంభం కానుంది. ఈ ఫైనల్‌లో టీమిండియా న్యూజిలాండ్‌తో తలపడనుంది. ప్రస్తుతం క్రికెటర్లంతా ముంబయిలో క్వారంటైన్లో ఉన్నారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అనంతరం టీమిండియా ఆగస్టు 4 నుంచి ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్ లో ముగియనుంది. అయితే ఇది చాలా లాంగ్ టూర్ కావడంతో క్రికెటర్లు, సహాయ సిబ్బందితో కుటుంబ సభ్యులను తీసుకెళ్లేందుకు ముందుగా బీసీసీఐ అనుమతి ఇచ్చింది. అనంతరం బ్రిటన్‌ ప్రభుత్వం అనుమతి కోరగా… బ్రిటన్‌ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అయితే కరోనా నేపథ్యంలో ఆటగాళ్ళు, సిబ్బంది బయో బబుల్ లో ఉండాల్సి వస్తుంది. దీంతో వారికి మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం. ఈ సమయంలో ఆటగాళ్ళు కుటుంబ సభ్యులతో ఉంటే వారు మానసికంగా మరింత ధృడంగా ఉంటారు. ఇటు భారత మహిళల జట్టు కూడా పురుషుల జట్టుతో ఇంగ్లాండ్‌లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. రెండు జట్లు కూడా ఒకే విమానంలో ఇంగ్లాండ్‌కు బయలుదేరనున్నాయి. మహిళలు, పురుషుల జట్లు ముందుగా సౌథాంప్టన్‌ చేరుకోగానే అక్కడే హోటళ్లలో క్వారంటైన్లో ఉంటారు. మూడు రోజుల క్వారంటైన్ అనంతరం నెట్స్‌లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు.