క్రికెట్.. మనదేశంలో ఇదో ఆట కాదు.. ఒక ఎమోషన్. క్రికెట్ మ్యాచులు ఎక్కడ జరుగుతున్నా ప్రేక్షకులు ఎగబడిపోతుంటారు. స్టేడియం మొత్తం నిండిపోతుంది. ఈలలు, గోల, ఒకటే సందడి.. పండగొచ్చినా రాని ఆనందం క్రికెట్ అనగానే ఉత్సాహం ఉబికి వస్తుంది. అందుకే క్రికెటర్లని దేవుళ్లలాగా భావిస్తారు. క్రికెటర్లకి కూడా ప్రేక్షకులు ఓ ఎనర్జీలాగా అనిపిస్తారు. స్టేడియం ఖాళీగా ఉంటే వాళ్లలో అంత ఉత్సాహం ఉంటుందా అంటే సందేహమే..
అసలు ప్రేక్షకులు లేకుండా క్రికెట్ మ్యాచులని మనదేశంలో చూడలేం. కానీ ఇప్పుడా పరిస్థితి వచ్చింది. దానికి కారణం కరోనా. కోవిడ్ కారణంగా ఆలస్యం అయిన ఐపీఎల్ టోర్నమెంట్ సెప్టెంబరు 19వ తేదీ నుండి మొదలవుతుంది. ఐతే కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో ప్రేక్షకులు అంతగా ఉండరు. ఒక్కోసారి ఉండకపోవచ్చు కూడా.
ఐతే ప్రేక్షకుల్లేకుండా జరిగే మ్యచులు క్రికెటర్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయనేది ఆసక్తికర అంశంగా మారింది. ఈ విషయమై న్యూజిలాండ్ మాజీ ఆటగాడు స్కాట్ స్టైరిస్ స్పందించాడు. ప్రేక్షకులు లేకుండా మ్యాచ్ ఆడటం ఇతర దేశాల ఆటగాళ్లకి అలవాటే. కానీ ఇండియా ఆటగాళ్ళు కొంత ఇబ్బంది పడాల్సి రావొచ్చని అంటున్నాడు. ఈ నేపథ్యంలో మనదేశ మాజీ ఆటగాడు అగార్కర్ మాట్లాడుతూ, స్టేడియంలో ప్రేక్షకుల అరుపులు, గోలలు లేకుండా ఆడటం కొంత కొత్తగానే ఉన్నా కూడా అదేమీ పెద్దగా ఇబ్బందిగా ఉండదని చెబుతున్నాడు.
సుమారు ఆరునెలల కాలంగా క్రికెట్ కి దూరంగా ఉన్న ఆటగాళ్లకి టోర్నమెంట్ మొదలవ్వడమే పెద్ద ఎక్సైటింగ్ గా ఉంటుందని, ఆట ఆడడమే వారికి ఆనందాన్ని ఇస్తుందని, ప్రేక్షకులు ఖచ్చితంగా బలంగా ఉంటారన్నది నిజమే అయినప్పటికీ క్రికెట్ ఆడటం బలాన్నిస్తుందని, ఒక రెండు మ్యాచులకి ఇబ్బంది పడినా ఆ తర్వాత సర్దుకుంటారని తెలిపాడు.సెప్టెంబర్ 19వ తేదీ నుండి మొదలవబోయే ఐపీఎల్ సీజన్లో మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరగనుంది.