చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. భారత్ ఉంచిన 482 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ ఛేదించలేకపోయింది. 164 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ఇంగ్లండ్‌పై 317 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో టెస్టు సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేపట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ 161 పరుగులు చేసి అద్భుతంగా రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 286 పరుగులు చేయగా, అందులో అశ్విన్ సెంచరీ ఉంది. టెస్టుల్లో అతనికిది 5వ సెంచరీ. ఇక ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134, రెండో ఇన్నింగ్స్‌లో 164 పరుగులు చేసింది.
మొదటి టెస్టు మ్యాచ్ కూడా చెన్నైలోనే జరిగింది. కానీ పిచ్ వేరు. అది మరీ నాసిరకంగా ఉందని సాక్షాత్తూ ఇంగ్లండ్ ప్లేయర్లే ఒప్పుకున్నారు. ఈ క్రమంలో రెండో టెస్టును భిన్నమైన పిచ్‌పై నిర్వహించారు. అయితే ఆ పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించింది. అందువల్లే భారత్ ఈ మ్యాచ్‌లో సునాయాసంగా విజయం సాధించగలిగింది. అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో 5, రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీయగా, అక్షర్ పటేల్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. స్పిన్నర్ల ప్రదర్శనతోపాటు బ్యాట్స్‌మెన్ విజయవంతం కావడం వల్లే ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగలిగింది.