ఐపీఎల్‌లో ఆడకుంటే జీతాల్లో కోతే

కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ 14వ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోయిన విషయం తెల్సిందే. అయితే టోర్నీలో 29 మ్యాచులే జరగగా మిగిలిన మ్యాచ్ లను సెప్టెంబర్లో యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కాగా ఐపీఎల్‌ రెండో దశ మ్యాచ్ లకు టోర్నీలో పాల్గొనే విదేశీ ఆటగాళ్లు అందరూ అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఆయా దేశాలకు ద్వైపాక్షిక సిరీసులు ఉండడంతో ఆటగాళ్ళను సదరు బోర్డులు ఐపీఎల్‌లో ఆడేందుకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడేందుకు యూఏఈకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

అయితే ఐపీఎల్‌ రెండో దశ మ్యాచ్ లను ఆడేందుకు యూఏఈకి రాని విదేశీ ఆటగాళ్ళ జీతాల్లో కోత పడనుంది. ఆటగాళ్లకు చెల్లించే పారితోషికంలో కోత పెట్టే హక్కులు ఫ్రాంచైజీలకు ఉన్నాయని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఆటగాళ్ళు ఇప్పటి వరకు ఆడిన మ్యాచులకే వేతనం చెల్లించే అవకాశం ఉందని ఆయన వివరించారు. అయితే బీసీసీఐ ఒప్పంద ఆటగాళ్లకు జీతాల్లో ఎలాంటి  కోత ఉండదని ఆయన స్పష్టం చేసారు. 2011 నుంచి ఒప్పంద ఆటగాళ్లకు భీమా వర్తిస్తుండం వల్ల వారి జీతాల్లో కోత ఉండదని వివరించారు.