లఖ్‌నవూ వేదికగా జరిగిన భారత్ – దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ లో సఫారీల చేతిలో టీమ్ ఇండియా చిత్తుగా ఓడిపోయింది. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది టీమ్ ఇండియా. అయితే వర్షం కారణంగా దాదాపు రెండున్నర గంటల తర్వాత మ్యాచ్ ప్రారంభమవ్వడంతో మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు.
మ్యాచ్ మొదటి నుంచే దక్షిణాఫ్రికా బ్యాటర్లు అదరగొట్టారు. భారత్‌కు 250 పరుగులను లక్ష్యంగా నిర్దేశించారు. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించినా.. క్యాచ్‌లను చేజార్చడం టీమ్ ఇండియా పాలిట శాపమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ చెరో వికెట్ తీశారు.
టీమ్ ఇండియాకు మొదటిలోనే ప్రతిఘటన ఎదురైంది. ఆరు ఓవర్లు పూర్తి కాక ముందే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇద్దరు ఓపెనర్లు శిఖర్ ధావన్ 16 బంతుల్లో 4 పరుగులు, శుభ్‌మన్ గిల్ 7 బంతుల్లో 3 పరుగుల పేలవ ప్రదర్శన చేసి పెవిలియన్ చేరారు. చివరివరకు శాంసన్ క్రీజులో ఉన్నప్పటికీ.. మరో ఎండ్‌లో బ్యాటర్లు లేకపోవడం వల్ల భారత్ ఓటమిపాలైంది.