భారత స్పిన్నర్లు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను చుట్టేశారు. స్పిన్‌కు స్వర్గధామంగా మారిన చెన్నై చెపాక్ పిచ్ లో భారత స్పిన్నర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో రెండో రోజు కూడా భారత్ పైచేయి సాధించింది. ఇంగ్లండ్ ను తొలి ఇన్నింగ్స్‌లో చాలా తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్‌ను కూడా ధీటుగా ప్రారంభించింది. దీంతో ఈ మ్యాచ్ లో టీమిండియా ఆధిపత్య స్థానంలో నిలిచింది.
300/6 ఓవర్ నైట్ స్కోరులో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ 329 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారత్ తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ 161 పరుగుల భారీ స్కోరు చేయగా, అజింక్యా రహానే 67 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ 4 వికెట్లు తీయగా, ఆల్లీ స్టోన్‌కు 3 వికెట్లు దక్కాయి. జాక్ లీచ్ 2, జో రూట్ 1 వికెట్ తీశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడిన ఇంగ్లండ్ 134 పరుగులు మాత్రమే చేసింది. భారత స్పిన్నర్ల ధాటికి ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్ విలవిలలాడిపోయారు. ఆ జట్టు ప్లేయర్లలో బెన్ ఫోక్స్ 42 పరుగులు చేసి కొద్ది సేపు నిలబడేందుకు ప్రయత్నించాడు. ఇక మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. భారత బౌలర్లలో అశ్విన్ 5 వికెట్లు తీసి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. అలాగే ఇషాంత శర్మ, అక్షర్ పటేల్‌లు చెరో 2 వికెట్లు తీయగా, సిరాజ్‌కు 1 వికెట్ దక్కింది.
కాగా ఇంగ్లండ్ ఆలౌట్ అయిన అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించి దూకుడుగా ఆడుతోంది. రోహిత్ శర్మ 62 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో 25 పరుగులు చేసి క్రీజులో ఉండగా, చటేశ్వర్ పుజారా 18 బంతుల్లో 1 ఫోర్‌తో 7 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్‌ను కోల్పోయి 54 పరుగుల స్కోరు వద్ద కొనసాగుతోంది. ఇంగ్లండ్ బౌలర్లలో జాక్ లీచ్‌కు 1 వికెట్ దక్కింది.