ఆస్ట్రేలియా పర్యటన ఏమోగానీ టీమిండియా క్రికెటర్లకు గాయాల బెడద పట్టుకుంది. ఎక్కువ సంఖ్యలో ప్లేయర్లు గాయాల బారిన పడ్డారు. ఇప్పటికే కొందరు గాయాల కారణంగా సిరీస్ నుంచి తప్పుకోగా తాజాగా సిడ్నీలో జరిగన 3వ టెస్టు మ్యాచ్‌లోనూ ఇంకొందరు ప్లేయర్లు గాయాలకు గురయ్యారు. దీంతో ఈ నెల 15వ తేదీ నుంచి జరగనున్న 4వ టెస్టుకు ఏయే ప్లేయర్లు అందుబాటులో ఉంటారు, ఎవరిని జట్టులోకి తీసుకోవాలి అని టీమ్ మేనేజ్‌మెంట్ తర్జన భర్జనలు పడుతోంది.
ఇక ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన టీమిండియా ప్లేయర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇషాంత్ శర్మకు పొట్ట భాగంలో గాయం కాగా ఉమేష్ యాదవ్‌కు మెల్‌బోర్న్ టెస్ట్ సందర్భంగా కాలి మడమలకు గాయమైంది. అలాగే రవీంద్ర జడేజాకు బ్యాటింగ్ చేసే సమయంలో ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. హనుమ విహారికి తొడ కండరాల గాయం అయినట్లు తెలిసింది. దీనిపై బీసీసీఐ ఇంకా స్పష్టతను ఇవ్వలేదు. జస్‌ప్రిత్ బుమ్రాకు ఉదర భాగంలో కండరాలు పట్టేసినట్లు సమాచారం. రిషబ్ పంత్‌కు మోచేయి గాయం అయింది.
కాగా ప్లేయర్లందరికీ ఇలా గాయాలు అవుతుండడం బీసీసీఐని, అటు టీమ్ మేనేజ్‌మెంట్‌ని కలవరానికి గురి చేస్తోంది. ఈ క్రమంలో చివరిదైన నాలుగో టెస్టు కీలకం అయిన నేపథ్యంలో అందులో ఏయే ప్లేయర్లను ఆడించాలని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అయితే తుది జట్టులోకి ఎవరెవరు వస్తారు అనే విషయం మరో 2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.