సిరాజ్ విషయంలోనూ హెచ్ సీఏ రాజకీయం చేస్తుందా

-

ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతంగా రాణించిన డెబ్యూ క్రికెటర్లకు ఆయా రాష్ట్రాలు ఘన స్వాగతం పలికాయి. విమానాశ్రయాల నుంచి భారీ ఊరేగింపులు నిర్వహించాయి. అక్కడి ప్రభుత్వాలతో కలిసి ఆయా రాష్ట్రాలోని క్రికెట్‌ సంఘాలు ఎంతో పొంగుపోయాయి కూడా. కానీ.. అలాంటి సందడి హైదరాబాద్‌లో లేదు. సాదాసీదా పేసర్‌ హైదరాబాదీ మహ్మద్‌ సిరాజ్‌ తన పేస్ బౌలింగ్ తో ఆస్ట్రేలియాలో దుమ్ము రేపారు అయినా హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ మాత్రం లైట్ తీసుకుంది.

ఆసిస్‌ టూర్‌లో హీరోగా నిలిచిన పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ను ఇప్పటివరకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ పట్టించుకున్న పాపాన పోలేదు. స్వాగతం లేదు.. ప్రశంసించిన దాఖలాలు లేవు. హెచ్సీఏ కు అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌ ఉన్నారు. అయినా సిరాజ్‌ విషయంలో ఉలుకు లేదు పలుకు లేదు. ఇది క్రికెట్‌ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఉన్న క్రికెటర్లు వేరే అసోసియేషన్లకు వెళ్లిపోతున్నా చూస్తూ ఊరుకుంటోంది. అంతర్గత రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోంది ప్రస్తుతం కార్యవర్గం.

హెచ్ సీఏ కు అజహరుద్దీన్‌ అధ్యక్షుడైన తర్వాత మంచి రోజులు వస్తాయని అంతా భావించారు. కానీ.. పరిస్థితి గతంలో కంటే దారుణంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. సిరాజ్‌ ఆస్ట్రేలియా టూర్‌లో ఉండగా.. అతని తండ్రి గౌస్‌ అనారోగ్యంతో చనిపోయారు. ఆసిస్‌ టూర్‌ నుంచి సిరాజ్‌ రాలేని పరిస్థితి. కనీసం హెచ్ సీఏ నుంచి ఒక్కరంటే ఒక్కరు వెళ్లి ఆ కుటంబాన్ని పరామర్శించలేదు. అప్పట్లోనే దీనిపై విమర్శలొచ్చాయి. ఇప్పుడు సిరాజ్‌ స్వయంగా నగరానికి వచ్చినా.. తమకేం సంబంధం లేదన్నట్టుగా ఉంది అసోసియేషన్‌ తీరు.

పేసర్‌ సిరాజ్‌ టీమిండియా ఆటగాడే కాదు. హైదరాబాదీ కూడా. అయినా హెచ్సీఏ తమకేం సంబంధం లేదన్నట్టు ప్రవర్తించడమే ఆశ్చర్య పరుస్తోంది. మహింద్రా కంపెనీ యజమాని ఆనంద్‌ మహీంద్ర.. ఆసిస్‌ టూర్‌లో మెరిసిన ఆరుగురు డెబ్యూ ప్లేయర్లకు SUV థార్‌ కార్లను ప్రెజెంట్‌ చేశారు. మన దగ్గర సిరాజ్‌ విషయంలో వెలడన్‌ అన్న మాట కూడా హెచ్ సీఏ నుంచి లేదు. సాధారణ గల్లీ క్రికెటర్లు సైతం సిరాజ్‌ను అభినందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హెచ్ సీఏ కానీ.. ప్రెసిడెంట్‌గా అజహరుద్దీన్‌ కానీ ఈ పేసర్‌ను అభినందిస్తూ ఒక్క ట్వీట్‌ కూడా చేయలేదు.

టీమిండియాలో చేరక ముందు సిరాజ్‌.. ఐపీఎల్ లో సన్‌ రైజర్స్‌కు ఆడాడు. అక్కడి నుంచి ఆర్సీబీకి వెళ్లాడు. కోహ్లీ దృష్టిలో పడటంతో టీమిండియాలోకి నేరుగా ఎంట్రీ ఇచ్చాడు. ఎదిగిన తర్వాతైనా సిరాజ్‌ మనోడే అని తన అకౌంట్‌లో వేసుకోలేకపోతోంది హెచ్ సీఏ. ఈ విషయంలో అసోషియేషన్‌కు ఇబ్బందులున్నాయో ఇగోలు ఉన్నాయో కానీ విమర్శలు మాత్రం ఓ రేంజ్‌లో ముసురుతున్నాయి. ఎందుకు సిరాజ్ పట్ల వివక్ష చూపుతుందో అజహరుద్దీన్‌ అండ్‌ టీమ్‌కే తెలియాలి.

Read more RELATED
Recommended to you

Latest news