ఇంగ్లండ్ పిచ్‌ల‌పై భార‌త బౌల‌ర్లు రాణిస్తారా..?

ఇంగ్లండ్‌లో పిచ్‌లు ఫ్లాట్‌గా ఉన్న‌ప్ప‌టికీ స్పిన్ బౌలింగ్‌కు కూడా అనుకూలిస్తాయి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో.. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తే స్పిన్న‌ర్లు కూడా ఇంగ్లండ్ పిచ్‌ల‌పై రాణించ‌వ‌చ్చు.

క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ స‌మ‌రానికి మ‌రో రెండు వారాల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. దీంతో వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడుతున్న అన్ని దేశాల‌కు చెందిన ప్లేయ‌ర్లు ఫిట్‌నెస్ ప‌రంగా అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. అలాగే కోచ్‌ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో త‌మలోని త‌ప్పులను స‌రిదిద్దుకుంటూ.. ఆట‌ను రోజు రోజుకీ మెరుగు ప‌రుచుకుంటున్నారు. నెట్స్‌లో నిత్యం సాధ‌న చేస్తున్నారు. అయితే ఇత‌ర దేశాల సంగ‌తేమో కానీ భార‌త్ మాత్రం ఈసారి వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం కొంత గ‌ట్టిగానే శ్ర‌మించాల్సి వ‌స్తుంద‌ని నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు.

భార‌త్ ముఖ్యంగా బౌలింగ్‌లో చాలా మెరుగు ప‌డాల‌ని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నున్న ఇంగ్లండ్ లో పిచ్‌ల‌న్నీ గ‌త కొంత కాలంగా ఫ్లాట్‌గా ఉంటున్నాయి. దీంతో ఆ పిచ్‌లు ఫాస్ట్ బౌల‌ర్ల‌కే ఎక్కువ‌గా అనుకూలిస్తాయ‌ని క్రికెట్ పండితులు చెబుతున్నారు. అయితే మ‌రోవైపు భార‌త జ‌ట్టులో పేస్ బౌల‌ర్ల ప్ర‌ద‌ర్శ‌న‌ను ఓసారి ప‌రిశీలిస్తే.. ప్ర‌స్తుతం జ‌ట్టులో ఉన్న జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమీల‌తోపాటు ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యాలు మాత్ర‌మే చ‌క్క‌ని ఫామ్‌లో ఉన్నారు. ఇక మ‌రో పేస్ బౌల‌ర్ భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఈ సారి ఐపీఎల్‌లో అంత‌గా ఆక‌ట్టుకోలేదు. దీంతో భువి వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఎలాంటి ప్ర‌ద‌ర్శ‌న ఇస్తాడోన‌ని అబిమానులు ఆందోళ‌న చెందుతున్నారు.

అయితే ఇంగ్లండ్‌లో పిచ్‌లు ఫ్లాట్‌గా ఉన్న‌ప్ప‌టికీ స్పిన్ బౌలింగ్‌కు కూడా అనుకూలిస్తాయి. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో.. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేస్తే స్పిన్న‌ర్లు కూడా ఇంగ్లండ్ పిచ్‌ల‌పై రాణించ‌వ‌చ్చు. ఇక ఈ విష‌యంలో భార‌త్ గురించి చెప్పాలంటే.. స్పిన్న‌ర్లు చాహ‌ల్, కుల‌దీప్‌యాద‌వ్‌లు ఇద్ద‌రూ స్పిన్ భారాన్ని మోయాల్సి ఉంటుంది. అయితే ర‌వీంద్ర జ‌డేజా, కేదార్ జాద‌వ్‌ల రూపంలో పార్ట్ టైం స్పిన్నర్లు కూడా ఉండడం భార‌త్‌కు క‌లిసొచ్చే అంశం. మ‌రి అన్ని ప్ర‌తికూల‌త‌ల‌ను దాటుకుని భార‌త బౌల‌ర్లు విజృంభిస్తారా.. ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల ప్లేయ‌ర్ల‌ను త‌మ బౌలింగ్‌తో ఇబ్బందుల‌కు గురి చేస్తారా.. లేదా.. అన్న‌ది త్వ‌ర‌లో తేల‌నుంది..!