క్రికెట్ ప్ర‌పంచ క‌ప్ స‌మ‌రం.. సౌతాఫ్రికాపై బోణీ కొట్టిన ఇంగ్లండ్‌..!

-

ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్న‌మెంట్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ జ‌ట్టు ఘ‌నంగా ప్రారంభించింది. సౌతాఫ్రికా జ‌ట్టుపై గెల‌వ‌డం ద్వారా ఇంగ్లండ్ త‌న ప్ర‌పంచ క‌ప్ వేట‌లో బోణీ కొట్టింది. ఆ జ‌ట్టుపై ఇంగ్లండ్ 104 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. కాగా తొలుగ టాస్ గెలిచిన సౌతాఫ్రికా జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించింది. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్ జ‌ట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోరు చేసింది. బెన్ స్టోక్స్ 79 బంతుల్లో 89 పరుగులు చేసి రాణించ‌గా, సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడికి 3 వికెట్లు ద‌క్కాయి. అలాగే ఇమ్రాన్ తాహిర్, రబాడాలు చెరో 2 వికెట్లు తీశారు.

ఇక 312 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో సౌతాఫ్రికా త‌న ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్ర‌మంలోనే ఆరంభంలో ఆమ్లా గాయ‌ప‌డ‌డంతో ఆ జ‌ట్టుకు కొంత ఇబ్బంది క‌లిగింది. ఇంగ్లండ్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ వేసిన షార్ట్ పిచ్ బంతి నేరుగా వెళ్లి ఆమ్లా హెల్మెట్‌కు త‌గ‌ల‌డంతో అత‌ను గాయ‌ప‌డి రిటైర్డ్ హ‌ర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ త‌రువాత సౌతాఫ్రికా జ‌ట్టు బ్యాట్స్‌మ‌న్ నిల‌కడ‌గా ఆడ‌డంలో విఫ‌లం అయ్యారు.

కేవ‌లం డి కాక్ (74 బంతుల్లో 68 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), వాన్ డర్ డుస్సెన్ (61 బంతుల్లో 50 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్)లు మాత్రమే రాణించారు. దీంతో ఆ జ‌ట్టు 39.5 ఓవర్లలో కేవలం 207 పరుగులు మాత్రమే చేయ‌గ‌లిగింది. అప్ప‌టికి ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ అంద‌రూ ఆలౌట్ అయ్యారు. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం సాధించింది. కాగా సౌతాఫ్రికా జ‌ట్టు 2015 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్‌తో జ‌రిగిన ఓ మ్యాచ్‌లో 130 పరుగుల భారీ తేడాతో ఓటమి చెంద‌గా, ఇప్పుడు ఇంగ్లండ్‌పై 104 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news