క్రికెట్ మ్యాచులలో ఇకపై ఏ ప్లేయర్ అయినా సరే గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగితే.. ఇక ఆ ప్లేయర్ అస్సలు ఆట ఆడే పరిస్థితి లేకపోతే.. అతని స్థానంలో వచ్చే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌కు బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు కూడా త్వరలో అవకాశం కల్పించనున్నారు.
ఏ ఆటలో అయినా సరే.. ఒక్కోసారి పలు కారణాల వల్ల ఆటగాళ్లు గాయపడుతుంటారు. ఇక క్రికెట్ విషయానికి వస్తే బౌలర్లు వేసే వేగవంతమైన బంతులను ఎదుర్కోవడంలో ఒక్కోసారి బ్యాట్స్‌మెన్ తీవ్ర గాయాల బారిన పడుతుంటారు. ముఖ్యంగా బౌలర్లు వేసే బౌన్సర్లు కొన్ని సందర్భాల్లో బ్యాట్స్‌మెన్ హెల్మెట్‌లకు తాకుతుంటాయి. ఇక కొన్నిసార్లయితే అవే బంతులు హెల్మెట్ లోపలి దాకా వెళ్లి బ్యాట్స్‌మెన్ల తలకు గాయాలు చేస్తుంటాయి. దీంతో అలాంటి గాయాల బారిన పడితే ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయేందుకు కూడా అవకాశం ఉంటుంది. అయితే అలాంటి గాయాల కారణంగా ఏ బ్యాట్స్‌మన్ అయినా సరే.. రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగితే.. అతని స్థానంలో వచ్చే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌కు కేవలం ఫీల్డింగ్ చేసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. బ్యాటింగ్ లేదా బౌలింగ్ చేసేందుకు వీలు ఉండదు. కానీ ఇకపై ఈ రూల్‌ను త్వరలో మార్చనున్నారు.
క్రికెట్ మ్యాచులలో ఇకపై ఏ ప్లేయర్ అయినా సరే గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగితే.. ఇక ఆ ప్లేయర్ అస్సలు ఆట ఆడే పరిస్థితి లేకపోతే.. అతని స్థానంలో వచ్చే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌కు బ్యాటింగ్, బౌలింగ్ చేసేందుకు కూడా త్వరలో అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఐసీసీ త్వరలో జరగనున్న వార్షిక సర్వ సభ్య సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనుంది. అయితే ఒక వేళ ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర లభిస్తే దీన్ని ఆగస్టు 1వ తేదీ నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య ప్రారంభమయ్యే యాషెస్ సిరీస్ నుంచే మొదటగా అమలు చేయనున్నారు. ఇక ఈ విధానాన్ని కాంకషన్ సబ్‌స్టిట్యూట్ అని వ్యవహరించనున్నారు.
2014లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఓ మ్యాచ్‌లో బంతి తలకు తాకడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఐసీసీ ఎదుట పైన చెప్పిన కాంకషన్ సబ్‌స్టిట్యూట్ ప్రతిపాదనను ఉంచింది. ఈ క్రమంలోనే ఐసీసీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని అంశాలను, నియమాలను కూలంకషంగా పరిశీలిస్తూ వస్తోంది. అలాగే పలువురు మాజీ క్రికెటర్లు, నిపుణుల అభిప్రాయాలను, ఆయా దేశాల క్రికెట్ బోర్డుల అభిప్రాయాలను కూడా ఐసీసీ పరిగణనలోకి తీసుకుంది. దీంతో ఈ విధానానికి ఐసీసీ కచ్చితంగా ఆమోద ముద్ర వేస్తుందని తెలుస్తోంది.. మరి ఈ కాంకషన్ సబ్‌స్టిట్యూట్ పద్ధతి ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో చూడాలి..!