ఎట్ట‌కేల‌కు బోణీ కొట్టిన పాక్‌.. ఇంగ్లండ్‌పై 14 ప‌రుగుల తేడాతో గెలుపు..!

-

ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీలో ఎట్ట‌కేల‌కు పాకిస్థాన్ జ‌ట్టు బోణీ కొట్టింది. ఇంగ్లండ్‌పై 14 ప‌రుగుల తేడాతో పాక్ గెలుపొందింది. త‌న తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో పాక్ ఘోర ఓట‌మి పాలు కాగా, ఇప్పుడు ఇంగ్లండ్‌పై గెలిచి ఆ జ‌ట్టు సంబ‌రాలు చేసుకుంటోంది. నాటింగామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో జ‌రిగిన ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీ 6వ మ్యాచ్‌లో భాగంగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్ తీసుకున్న పాక్ ఇంగ్లండ్ ఎదుట 349 ప‌రుగుల భారీ విజ‌య ల‌క్ష్యాన్ని ఉంచ‌గా.. ఇంగ్లండ్ ప్లేయ‌ర్లు కొంత సేపు నిల‌క‌డ‌గానే ఆడారు.

అయితే ఇంగ్లండ్ జ‌ట్టు ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోయింది. అయిన‌ప్ప‌టికీ జో రూట్ (104 బంతుల్లో 107 పరుగులు, 10 ఫోర్లు, 1 సిక్సర్), జాస్ బట్లర్ (76 బంతుల్లో 103 పరుగులు, 9 ఫోర్లు, 2 సిక్సర్లు)లు సెంచ‌రీల‌తో రాణించ‌డంతో ఇంగ్లండ్ ఓ ద‌శ‌లో గెలుస్తుంద‌ని అంతా భావించారు. కానీ పాక్ బౌల‌ర్లు ఇంగ్లండ్ బ్యాటింగ్‌కు అడ్డుక‌ట్ట వేశారు. దీంతో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులు మాత్రమే చేసింది. ఈ క్ర‌మంలో విజ‌యం పాక్‌ను వ‌రించింది. కాగా పాక్ బౌలర్లలో వహబ్ రియాజ్‌కు 3 వికెట్లు ద‌క్క‌గా, షాదాబ్ ఖాన్, మహమ్మద్ అమీర్‌లకు చెరో 2 వికెట్లు, మహమ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్‌లకు చెరో వికెట్ దక్కాయి.

అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన పాక్ బ్యాట్స్‌మెన్ల‌లో మహమ్మద్ హఫీజ్ (62 బంతుల్లో 84 పరుగులు, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), బాబర్ అజాం (66 బంతుల్లో 63 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ (44 బంతుల్లో 55 పరుగులు, 5 ఫోర్లు)లు రాణించారు. కాగా ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్, మొయిన్ అలీలకు చెరో 3 వికెట్లు దక్కగా, మార్క్ వుడ్‌కు 2 వికెట్లు ద‌క్కాయి. ఇక రేపు జ‌ర‌గ‌నున్న మ‌రో వ‌ర‌ల్డ్ క‌ప్ లీగ్ మ్యాచ్‌లో ఆఫ్గ‌నిస్తాన్‌, శ్రీ‌లంక జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version