ప్రపంచ బ్యాడ్మింటెన్ లోని ఆసియా ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు గోల్డ్ మెడల్ సాధిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ.. సెమీస్ లో ఆమె పరాజయం పాలైంది. అయినా.. పతకం మాత్రం సాధించారు. మెరుగైన ఆట తీరుతో సెమీస్ చేరుకున్న సింధు.. ఫైనల్ కు చేరుకుంటుందని క్రీడాభిమానులు భావించారు. కానీ.. ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం పీవీ సింధు కాంస్యంతో సరిపెట్టుకుంది. టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యమగుచి (జపాన్)తో జరిగిన మహిళల సింగిల్స్ సెమీస్‌లో సింధు 21-13, 19-21, 16-21తో ఓటమి పాలైంది. దూకుడుగా ఆడి తొలి గేమ్‌ను దక్కించుకున్న సింధు.. రెండో గేమ్‌లోనూ అదే దూకుడు కొనసాగించింది. అయితే, 14-11తో ఆధిక్యంలో ఉన్న సమయంలో సర్వీస్ ఆలస్యం చేస్తోందన్న కారణంతో సింధుకు రిఫరీ ఒక పెనాల్టీ పాయింట్ విధించాడు.
దీంతో రిఫరీతో వాదనకు దిగిన సింధు చీఫ్ రిఫరీకి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ నిరాశే ఎదురైంది. ఈ ఘటన తర్వాత సింధు ఏకాగ్రత కోల్పోవడంతో ప్రత్యర్థి దానిని అందిపుచ్చుకుంది. ఆ తర్వాత యమగుచి దూకుడు పెంచి వరుస సెట్లను గెలుచుకుని ఆధిక్యంలోకి వెళ్లింది. మూడో గేమ్‌లోనూ అదే జోరు కొనసాగించిన యమగుచి 21-16తో గెలుచుకుని ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. సింధు ఓటమితో బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత షట్లర్ల పోరు ముగిసింది.