సొంత మనుషులు ఎవరు.. పై వారు ఎవరు అని వేదాంతం వినిపించడం సులువు. కానీ కష్ట కాలంలో తన వారికి అండగా ఉండకుండా, ఇష్టారాజ్యంగా లేదా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరించడం వేరు. అందుకే ఆ గ్రామస్థులు ఎప్పటి నుంచో పగతో ఉన్నారు. పంతంతో ఉన్నారు. పుట్టెడు దుఃఖానికి కారణం తమ గ్రామానికి చెందిన కీలక నేత, గ్రామాధ్యక్షుడి మరణం. అదే వారి కోపానికి కారణం. మరణం కాదు హత్య. ఈ హత్య వెనుక ఎవరి ప్రమేయం ఉందో ఆ గ్రామస్థులకు తెలుసు.
అందుకే అనుమానితుడిగా భావిస్తున్న ఎమ్మెల్యే అనుచరుడిపై ఎప్పటి నుంచో కోపంతో ఉన్నారు అదే కోపం ఈ రోజు ఎమ్మెల్యే పై చూపించారు. ఫలితం ఆయనను దేహ శుద్ధి చేసి మరీ విడిచిపెట్టారు. అతి కష్టం మీద పోలీసులు ఆయన్ను తప్పించారు. రెండు నుంచి మూడు గంటల ఉద్రిక్తత ఫలితం ఏంటన్నది ఇంకా తేలలేదు. గోదావరి తీరాల చెంత తీవ్ర ఉత్కంఠతకు తావిచ్చిన ఘటన రాష్ట్ర రాజకీయాల్లోనే సంచలనం.
రాజకీయాల్లో రాణింపు మరియు గౌరవం అన్నవి అంత సులువుగా రావు. అవి పరస్పర ఆధారితాలు. ఇప్పటిదాకా ఉన్న లెక్క వేరు ఇకపై ఉండే లెక్క వేరు. ఆ విధంగా రాజకీయాల్లో పెను మార్పులు వస్తుంటాయి. అనూహ్య పరిణామాలు సిద్ధిస్తుంటాయి.
కానీ రాజకీయాల్లో కొన్ని సార్లు ప్రతిఘటనలూ ఉంటాయి. వాటిని దాటుకుని రావడం ఇంకా కష్టం. భౌతిక దాడులు కూడా జరుగుతుంటాయి. ఇవన్నీ అనూహ్యాలే. తమ సొంత పార్టీ మనుషులే సొంత పార్టీ ఎమ్మెల్యే పై చేసిన తిరుగుబాటు గోదావరి తీరాన సంచలనం అయింది. వార్తల్లో నిలిచిన గోపాల పురం ఎమ్మెల్యే వెంకట్రామి రెడ్డి పై జరిగిన దాడి ఓ విధంగా అనూహ్యం. ఓ విధంగా ఎప్పటి నుంచో ఆ గ్రామంలో అంటే జి.కొత్తపల్లిలో రగులుకుంటున్న కోపానికి తార్కాణం. ఇవాళ్టి పరిణామాల వెనుక కారణాలేంటో చూద్దాం.
పశ్చిమ గోదావరి జిల్లా, జి.కొత్తపల్లి గ్రామానికి చెందిన వారంతా ఎప్పటి నుంచో ఓ సమస్యపై ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్నారు. గ్రామధ్యక్షుడు గంజి ప్రసాద్ దారుణ హత్యకూ, ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి అనుచరుడికీ ఏదో సంబంధం ఉందని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. అందుకు తగ్గ ఆధారాలు సైతం సేకరించే పనిలోనే ఉన్నారు. కీలక అనుచరుడ్ని వెనకేసుకు వచ్చిన కారణంగానే ఈ రోజు ఆ ఎమ్మెల్యేకు తీవ్ర అవమానం జరిగింది. ఇవాళ ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శకు వెళ్లిన ఆయనకు మామూలుగా కాదు జీవితంలో మరిచిపోలేని విధంగా పిడి గుద్దులు గుద్ది మరీ పంపారు. మరి! నాయకులు మారుతారా ?