ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌.. ఆఫ్గ‌నిస్థాన్‌పై క‌ష్ట‌ప‌డి గెలిచిన శ్రీ‌లంక‌..!

ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019లో ఎట్ట‌కేల‌కు శ్రీ‌లంక గెలిచింది. న్యూజిలాండ్ చేతిలో త‌న మొదటి మ్యాచ్‌లో శ్రీ‌లంక ఘోర ప‌రాజ‌యం పాలవ్వ‌గా, ఆఫ్గ‌నిస్థాన్‌పై ఇవాళ గెలిచి కొంత ఊర‌ట చెందింది. ఉత్కంఠ‌గా సాగిన మ్యాచ్‌లో ఆఫ్గ‌నిస్తాన్‌పై శ్రీ‌లంక 34 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. వ‌ర్షం కార‌ణంగా ఓవ‌ర్ల‌ను, స్కోరు కుదించ‌డంతో ఆఫ్గ‌నిస్థాన్ 41 ఓవ‌ర్ల‌లో 187 ప‌రుగులు చేయాల్సి వ‌చ్చింది. అయితే బ్యాట్స్‌మెన్ వెంట వెంట‌నే ఔట్ కావ‌డంతో ఆఫ్గ‌నిస్థాన్ 32.4 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 152 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అయింది.

ఆఫ్గ‌నిస్థాన్ బ్యాట్స్‌మెన్ల‌లో నజీబుల్లా జద్రాన్ (56 బంతుల్లో 43 పరుగులు, 6 ఫోర్లు), హజ్రతుల్లా జజయ్ (30 పరుగులు)లు రాణించారు. ఈ క్ర‌మంలో మిగిలిన ఆఫ్గ‌న్ బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ స‌రిగ్గా ఆడ‌లేక‌పోయారు. దీంతో శ్రీ‌లంక ఈ మ్యాచ్‌లో సుల‌భంగానే గెలిచింది. కాగా శ్రీ‌లంక బౌల‌ర్ల‌లో నువాన్ ప్రదీప్‌కు 4 వికెట్లు ద‌క్క‌గా, మలింగాకు 3 వికెట్లు ద‌క్కాయి. ఉదానా, తిశారా పెరీరాలు చెరో వికెట్ తీశారు.

కాగా టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు దిగిన శ్రీ‌లంక 36.5 ఓవ‌ర్ల‌లో 201 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ల‌లో కుశాల్ పెరీరా 81 బంతుల్లో 78 పరుగులు (8 ఫోర్లు) చేయ‌గా, కెప్టెన్ దిముత్ కరుణరత్నె 30 ప‌రుగులు, లాహిరు తిరుమన్నె 25, ఇసురు ఉదానా 10, సురంగ లక్మల్ 15 ప‌రుగులు చేశారు. ఆఫ్గన్ బౌలర్లలో మహమ్మద్ నబీ 4 వికెట్లు తీసి శ్రీలంక టాప్ ఆర్డర్‌ను కుప్ప కూల్చ‌డంతో లంక జ‌ట్టు త‌క్కువ స్కోరు న‌మోదు చేసింది. అలాగే మరో ఇద్దరు బౌలర్లు దావ్లత్ జద్రాన్, రషీద్ ఖాన్‌లు చెరో 2 వికెట్లు తీశారు. హమీద్ హసన్‌కు 1 వికెట్ దక్కింది.

కాగా మ్యాచ్‌ మధ్యలో వర్షం కారణంగా ఆటకు అంతరాయం క‌లిగింది. దీంతో ఇరు వైపులా 9 ఓవర్ల ఆట‌ను త‌గ్గించారు. అలాగే డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం.. ఆఫ్గనిస్థాన్ ఛేదించాల్సిన లక్ష్యాన్ని 41 ఓవర్లలో 187 పరుగులకు స‌వ‌రించారు. అయిన‌ప్ప‌టికీ ఆఫ్గనిస్థాన్ జట్టు తమ ఇన్నింగ్స్ ఆరంభంలో మ్యాచ్‌ను గెలిచేటట్లే కనిపించినా ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్లను కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. దీంతో ఆఫ్గ‌నిస్థాన్‌కు ఓట‌మి ఎదురైంది. లంక విజ‌యం సాధించింది..!