బీసీసీఐకి చైనా వస్తువుల బ్యాన్ సెగ తగిలింది. దేశ సరిహద్దుల్లో 20 మంది భారత జవాన్లను చంపినందుకు గాను ఇప్పుడు దేశమంతా చైనాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. చైనా వస్తువులు, కంపెనీలను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే విషయమై బీసీసీఐ కూడా తర్జన భర్జనలు పడుతున్నట్లు తెలిసింది. చైనా కంపెనీ అయిన వివో.. ఐపీఎల్‌కు టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. దీంతో ఆ కంపెనీకి సదరు హక్కులను నిలిపివేయాలని, స్పాన్సర్‌షిప్‌ను రద్దు చేయాలని బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు.
చైనాకు చెందిన మొబైల్స్ తయారీ కంపెనీ వివో ఎంతో కాలంగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. కాగా గత 5 సంవత్సరాలుగా వివో రూ.2,199 కోట్లను ఇందుకు గాను ఖర్చు చేసింది. ఇక ఈ ఏడాదికి కూడా వివో సదరు హక్కులను పొందింది. కానీ కరోనా నేపథ్యంలో టోర్నీ జరగలేదు. అయితే వివో చైనా కంపెనీ కనుక.. ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఆ కంపెనీకి ఉన్న టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను రద్దు చేసి, ఆ కంపెనీని బ్యాన్ చేయాలని బీసీసీఐని డిమాండ్ చేస్తున్నారు.
అయితే బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ప్రస్తుతానికి భారత్‌లో చైనా వస్తువులు, కంపెనీలపై ఎలాంటి నిషేధం లేదని, కానీ ఒక వేళ నిషేధం విధిస్తే కచ్చితంగా వివోకు ఆ హక్కులను రద్దు చేస్తామని తెలిపారు. భారతీయుల సెంటిమెంట్లపై తమకు గౌరవం ఉందని, వారి అభిప్రాయాలకు విలువనిస్తామని తెలిపారు. అయితే చైనా వస్తువులు, కంపెనీలపై అధికారికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటన వచ్చే వరకు తాము ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేశారు.