భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయం శ్రీరామ నవమి వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ ఉత్సవాలకు తరలి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వసతులు కల్పిస్తున్నారు.
మరోవైపు భద్రాద్రి ఆలయంలో శ్రీరామ నవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు బేడా మండపంలో అగ్ని మథనం, అగ్ని ప్రతిష్ట వేడుకలు నిర్వహించారు. ముందుగా బేడా మండపంలో సీతారాముల ఎదుట ప్రకృతి పరంగా అగ్నిని సృష్టించి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి హోమం నిర్వహించారు. అనంతరం ధ్వజపట ఆవిష్కరించారు. ధ్వజపట ఆవిష్కరణ అనంతరం గరుడ ప్రసాదాన్ని సంతానం లేని దంపతులకు అందించనున్నారు. ధ్వజపట ఆవిష్కరణ రోజు గరుడ ప్రసాదాన్ని స్వీకరిస్తే సంతానం కలుగుతుందని చాలా ఏళ్ల నుంచి భక్తుల నమ్మకం.
రేపు సాయంత్రం నుంచి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టాలు ప్రారంభం కానున్నాయి. రేపు సాయంత్రం సీతారాములకు ఎదుర్కోలు మహోత్సవం, ఈనెల 30న ఉదయం 10:30 నుంచి 12:30 గంటల వరకు సీతారాముల కళ్యాణ మహోత్సవం, ఈనెల 31న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వేడుకలు జరగనున్నాయి.