గతేడాది ఎండలు ఎంత తీవ్రంగా దంచికొట్టాయో చూశాం. ఈ సంవత్సరం దానికి డబుల్ తీవ్రతతో ఎండలు మండే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువే ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న అంచనాలున్నాయి. ఫిబ్రవరి మూడో వారం నుంచి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 39.5 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి.
సాధారణంగా ఫిబ్రవరి నెలాఖరు నుంచి ఎండలు ప్రారంభమవుతుంటాయి. దీనికి భిన్నంగా పది రోజులు ముందుగానే మొదలయ్యాయి. దాదాపు అన్ని జిల్లాల్లోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ రెండో వారం నుంచి జూన్ మొదటి వారం వరకు ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకుంటాయని ముందస్తు అంచనాలున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న వాతావరణ మార్పులకు అనుగుణంగా దేశంలో రానున్న ఉష్ణోగ్రతల్లో తేడాలపై భారత వాతావరణ శాఖ ఇప్పటికే ఒక ప్రణాళికను రూపొందించింది. రెండు రోజుల్లో దేశంలో రీజియన్ల వారీగా అంచనాలను వెల్లడించే అవకాశాలున్నాయి. తెలంగాణలోనూ రానున్న వేసవిలో ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది నివేదికలో పేర్కొననున్నారు. దీనికి అనుగుణంగా హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా స్థానిక మార్పులపై ప్రకటన జారీ చేయనుంది.